TVK తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఈ పార్టీ, ఊహించని రీతిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అనూహ్య విజయం నేపథ్యంలో ప్రముఖ కథానాయిక త్రిష రాజకీయ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. టీవీకే తరఫున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో ఆయన గెలిచారు. అయితే, నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం విజయ్ పెరంబూర్‌ను అట్టిపెట్టుకుని తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో టీవీకే అభ్యర్థిగా త్రిష బరిలోకి దిగుతారని ‘దినమణి’ పత్రిక తన కథనంలో పేర్కొంది.
ఎన్నికల ఫలితాల్లో టీవీకే ఆధిక్యం స్పష్టమవుతున్న సమయంలో నటి త్రిష చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
టీవీకే హామీల అమలుపైనే అందరి దృష్టి
టీవీకే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీ ఎన్నికల వాగ్దానాలపై నిలిచింది. తాము అధికారంలోకి వస్తే పెళ్లికూతుళ్లకు 8 గ్రాముల బంగారం, మహిళా కుటుంబ పెద్దలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అలాగే, “నిజాయతీతో కూడిన పరిపాలన” అందిస్తామని ప్రకటించింది. సంక్షేమ పథకాల అమలుకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని పార్టీ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.
వీటితో పాటు ఐదు లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు ఐదు లక్షల పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.4,000 భృతి, ఉన్నత చదువుల కోసం రూ.20 లక్షల వరకు విద్యా రుణాలు వంటి హామీలు కూడా టీవీకే మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఈ భారీ హామీలను ఎలా అమలు చేస్తుందనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
