Bilawal Bhutto -Imran Khan : పాకిస్తాన్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడి రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. పాక్ పార్లమెంటు రద్దయ్యే వరకు నడిచిన సంకీర్ణ ప్రభుత్వంలో నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ, బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ భాగస్వాములుగా ఉండేవి. ఈ రెండు పార్టీలు కలిసి ఏర్పాటుచేసిన కూటమిని పాకిస్తాన్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ (పీడీఎం) అని పిలిచేవారు. అయితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరగనున్న పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ‘పీడీఎం’ కూటమి కొనసాగే అవకాశాలు కనిపించడం లేదంటూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also read : Delhi Alliance : పొత్తుకు చంద్రబాబు సై! ముందస్తు సంకేతాలు!!
సాధారణంగా పార్లమెంటు రద్దయిన 90 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి కావాలి. కానీ ప్రస్తుతం ఎన్నికల కమిషన్, ఆపద్ధర్మ ప్రధాని కలిసి హడావుడిగా పాకిస్తాన్ లోని లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. ఇదంతా పూర్తి కావడానికి దాదాపు 6 నెలల టైం (180 రోజులు) పట్టనుంది. అంటే పాక్ రాజ్యాంగ నిబంధనల కంటే రెట్టింపు సమయాన్ని ఎన్నికల నిర్వహణ కోసం ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకుంటోంది. దీన్ని మొదటి నుంచీ బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) వ్యతిరేకిస్తోంది. ‘రాజ్యాంగం ప్రకారం సకాలంలో ఎలక్షన్ పూర్తి చేయాలి. ఆపద్ధర్మ ప్రభుత్వం అనవసరంగా మిగతా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. ఇది సరికాదు’ అని పీపీపీ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
Also read : LPG Gas Users : ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.200 తగ్గింపు
అంతేకాదు.. ఇటీవల కరెంటు బిల్లులను పెద్దఎత్తున పెంచిన టైంలో ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ శ్రేణులతో కలిసి పీపీపీ క్యాడర్ నిరసనల్లో (Bilawal Bhutto -Imran Khan) పాల్గొంది. ఆపద్ధర్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీపీపీ నేతలు నినాదాలు చేశారు. రోడ్లపై ధర్నాలు చేశారు. టైర్లు తగలబెట్టి రాస్తారోకోలు నిర్వహించారు. ఈ పరిణామాలతో నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ షాక్ కు గురైంది. ఇమ్రాన్ కు బిలావల్ భుట్టో చేరువయ్యారనే సంకేతాలను పంపేలా చోటుచేసుకున్న ఈ పరిణామాలు.. రానున్న రోజుల్లో పాక్ లో మారబోయే పొలిటికల్ సీన్ కు అద్దంపడుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే.. నవాజ్ షరీఫ్ పార్టీకి ఎదురుగాలి వీచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో ఇప్పటికే పాక్ ప్రజలకు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉంది. దీన్ని తమకు అడ్వాంటేజ్ గా మలుచుకొని పీపీపీ, పీటీఐల టీమ్ ఈజీగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.