ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై (Tik Tok) నిషేధం విధించేందుకు అమెరికా (America) చట్టసభలో రంగం సిద్ధమవుతోంది. ఆ దేశంలోని రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీలు ఒక బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టారు. అమెరికా వాసులపై నిఘా కోసం చైనా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చేమోనన్న ఆందోళనను ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మార్కో రూబియో, మైక్ గల్లాఘర్, డెమోక్రాటిక్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం రష్యా, చైనాల ప్రభావం ఉన్న ఏ సోషల్ మీడియా కంపెనీనైనా బ్లాక్ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.
చైనా ప్రభుత్వంతో తాము డేటాను పంచుకోవడంలేదని టిక్‌టాక్ (Tik Tok) గతంలోనే చెప్పింది. ఈ నేపథ్యంలో మంగళవారం స్పందిస్తూ ‘‘రాజకీయ ప్రేరేపితమైన నిషేధం’’ అని వ్యాఖ్యానించింది. కొందరు అమెరికా కాంగ్రెస్ సభ్యులు రాజకీయ ఉద్దేశాలతో ఈ బిల్లును ముందుకు తీసుకెళుతున్నారని పేర్కొన్నారు. దీని వల్ల అమెరికా జాతీయ భద్రతకు అదనంగా లభించే ప్రయోజనం ఏమీ లేదని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో మరోసారి టిక్‌టాక్‌పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు చట్టసభ ఎదుటకు రావడం గమనార్హం. ఇప్పటికే ట్రంప్ హయాంలో టిక్‌టాక్‌పై నిషేధానికి యత్నించారు. కానీ, అప్పట్లో అది సాధ్యం కాలేదు. 2020లో కొత్త వినియోగదారులు టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండా, ఇతర కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకొంది. అప్పట్లో టిక్‌టాక్ (Tik Tok) పలుమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ కేసుల్లో టిక్‌టాక్ గెలవడంతో నిషేధం అమల్లోకి రాలేదు.
Also Read: WhatsApp Update : సరికొత్త ఫీచర్.. ఒకసారి చూడగానే మెసేజ్ మాయం!