Layoff: అతడిని పెళ్లి చేసుకోవాలా? వద్దా? ..నాకు తెలియడం లేదంటున్న అమ్మాయి

పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం. చాలామంది తమ పెళ్లి విషయంలో చాలా అంచనాలను, ఆశలను కలిగి ఉంటారు.

  • Written By:
  • Updated On - February 7, 2023 / 08:43 PM IST

Layoff: పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం. చాలామంది తమ పెళ్లి విషయంలో చాలా అంచనాలను, ఆశలను కలిగి ఉంటారు. తమ జీవిత భాగస్వామి పలానా విధంగా ఉండాలనే వాళ్లు.. దానికి తగ్గట్టుగా అమ్మాయిని, అబ్బాయిని ఎంచుకుంటూ ఉంటారు. అయితే జీవితం అనేది ఎవరికీ సరిగ్గా ఊహించినట్లు ఉండదు కదా. అచ్చంగా ఇలాంటి విచిత్ర పరిస్థితే ఓ అమ్మాయికి వచ్చింది. దాంతో ఆ అమ్మాయి తనకు వచ్చిన కష్టం గురించి నెట్టింట ప్రశ్నించింది.

ఓ అమ్మాయికి ఇంట్లో వాళ్లు ఓ అబ్బాయిని చూసి పెళ్లి కుదిర్చారు. అబ్బాయి పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగంతో పాటు శాలరీ కూడా చాలా ఎక్కువగానే వస్తోంది. దీంతో రెండు కుటుంబాలు పెళ్లికి అంతా సిద్ధం చేసుకుంటున్న తరుణంలో అనుకోని షాక్ తగిలింది. అబ్బాయి ఉద్యోగం ఊడింది. ఇంతకీ అబ్బాయి ఉద్యోగం ఊడింది.. మైక్రోసాఫ్ట్ తాజాగా చేపట్టిన లేఆఫ్ లో.

దీంతో అమ్మాయి తనకు వచ్చిన పరిస్థితిని ఎలా డీల్ చేయాలని సోషల్ మీడియాకెక్కింది. సోషల్ మీడియాలో అమ్మాయి పోస్ట్ పెడుతూ.. ‘మాది కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం. ఫిబ్రవరిలో ముహూర్తం నిర్ణయించారు. ఇంతలోనే నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయిని మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఈ విషయం నా కుటుంబానికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది నాకు తెలియడం లేదు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అతని జీతం రూ.2.5లక్షలు ఉండేది. కానీ ఇప్పుడు అతడికి ఉద్యోగం లేదు. నన్ను ఏం చేయమంటారు? అతడిని పెళ్లి చేసుకోవచ్చా?’ అని ప్రశ్నించింది.

అమ్మాయి పోస్ట్ గురించి చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఉద్యోగం లేని వాడు ఎలా పోషిస్తాడు అతనికంటే మంచి స్థాయిలో ఉన్న అబ్బాయి దొరుకుతాడు. అతడిని వదిలెయ్’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘అయినా పెళ్లి బంధాలు ఇప్పుడు వ్యాపార లావాదేవీల్లా మారాయి కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తేనే బెటర్’ అని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకొందరు మాత్రం.. ‘ఈ ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం పోయినంత మాత్రాన అబ్బాయి మరీ పనికిరాకుండా పోడని, అంత చులకన భావన ఉండకూడదు’ అని సలహా ఇచ్చారు.