BRS : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు శాసన మండలి, శాసన సభ లలో బీఆర్ ఎస్ పార్టీ విప్ లను ప్రకటించారు. ఈ మేరకు శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ను నియమిస్తూ కేసీఆర్ ఆదేశాలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం మూడో అసెంబ్లీ కొలువుతీరిన 13నెలల తరువాత మండలి, శాసన సభలకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విప్ లను ప్రకటించడం గమానార్హం.
Read Also:Prayagraj : మహా కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని ..షెడ్యూల్ ఇదేనా..?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 113స్థానాలకు గాను 64 స్థానాల్లో విజయం సాధించగా, 39చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 8, మజ్లిస్ 7స్థానాల్లో విజయం సాధించగా, సీపీఐ ఒకచోట గెలుపొందింది. నూతన శాసనసభ్యులతో కొత్త శాసనసభ డిసెంబర్ 9న ఏర్పాటైంది. కుల గణన సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో కేసీఆర్ పార్టీ విప్ లపై ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాక.. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ నేపథ్యంలో శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన సందర్భంలో విప్ ల ప్రకటన రాజకీయంగా మరింత ఆసక్తి రేపింది.
కాగా, కేసీఆర్ ప్రస్తుతం శాసన సభలో బీఆర్ఎస్ పక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అటు శాసన మండలి పక్ష నేతగా మాజీ స్పీకర్ జి.మధుసూధన చారి కొనసాగుతున్నారు. శాసన మండలి..శాసన సభలలో పార్టీ విప్ ల ప్రకటన నేపథ్యంలో ఇక సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టవచ్చని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.