Leopard : హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత ప్రత్యక్షమై కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్ చిరుతను చూసినట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకి వచ్చిన చిరుత అక్కడి నుంచి చెట్ల వైపు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు కూడా గుర్తించారు. ఈ ఘటన విశ్వవిద్యాలయ పరిసరాల్లో భయాందోళనను కలిగించింది. విద్యార్థులు, స్థానికులు ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనన్న భయంతో ఉన్నారు. గతంలోనూ రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుతలు కనిపించడం ఇదేం కొత్తకాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చిరుతలు తిరుగుతూ ఉండటం ఇక్కడి ప్రజలందరికీ తెలిసిందే.
గత సంఘటనలు.. చిరుతల వల్ల కలిగిన అనుభవాలు
2020లో హిమాయత్ సాగర్ సమీపంలోని వాలంటరీ రీసెర్చ్ ఫ్యూమ్ హౌస్ వద్ద చిరుత దాడి చేసిన ఘటన పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఆ సమయంలో చిరుత ఒక ఆవు దూడను చంపి తింటున్న దృశ్యాలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాయి. ఆవుల యజమాని డప్పు శబ్ధం చేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయినప్పటికీ, ఈ ఘటన స్థానికులకు తలకునకలే కలిగించింది.
అధికారుల నిర్లక్ష్యం పట్ల స్థానికుల ఆవేదన
చిరుతల సంచారం పట్ల స్థానికులు గతంలోనే పలుమార్లు అధికారులను అప్రమత్తం చేయడం జరిగినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారం ఇలాగే కొనసాగితే ఎవరి ప్రాణాలకు ఎప్పుడు ముప్పు వస్తుందోనన్న ఆందోళనతో స్థానికులు జీవనం సాగిస్తున్నారు.
ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత ప్రత్యక్షం కావడం కొత్త భయానికి దారి తీసింది. బహిరంగ ప్రదేశాల్లో చిరుత సంచారం వల్ల విద్యార్థులు కూడా తరచూ భయంతో ఉన్నారు. వాకింగ్ చేయడానికి వెళ్లిన వారు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఏర్పడింది. చిరుతలను పట్టుకుని ఈ ప్రాంత ప్రజలను భయం నుంచి విముక్తి చేయడంలో అధికారులు ముందడుగు వేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Sankranti 2025 : ప్రయాణికుల రద్దీ – ప్రవైట్ కాలేజీల బస్సులు వాడుకోండి : సీఎం చంద్రబాబు