Site icon HashtagU Telugu

Arvind Kejriwal : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు తొక్కని అడ్డదారి లేదు

Arvind Keriwal

Arvind Keriwal

Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల తీరుపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ఎలాంటి అడ్డదారులకైనా వెళ్తున్నారని, తమ విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 7 వరకు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 5,500 మంది తమ ఓటు రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తులు సమర్పించారని కేజ్రీవాల్ తెలిపారు. అయితే, సంబంధిత అధికారులు ఆ దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఎందుకు ఓటు రద్దు కోరుతున్నారని అడగగా, తాము అసలు ఈ ప్రక్రియలో పాల్గొనలేదని, దరఖాస్తుల గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పాకిస్థాన్ నుంచి లాగేసుకుంటారా?

ఈ వ్యవహారాన్ని బీజేపీ పన్నిన కుట్రగా కేజ్రీవాల్ అభివర్ణించారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను రద్దు చేయించేందుకు బీజేపీ కార్యకర్తలే ఈ ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపించారు. ఇదే కాదు, గత 15 రోజులలో ఢిల్లీలో కొత్త ఓటర్ల నమోదు కోసం 13,000 దరఖాస్తులు వచ్చినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే, ఈ దరఖాస్తులు నిజమైన ఢిల్లీ వాసులవి కావని, బీజేపీ ఇతర రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న వారిని ఢిల్లీలో ఓటర్లుగా నమోదు చేస్తుందని విమర్శించారు.

బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయన నిర్వహిస్తున్న జాబ్ క్యాంపుల సందర్భంగా డబ్బులు పంచుతున్నట్టు కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ చర్యలు ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని, వెంటనే పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడంతో పాటు, ఇంట్లో సోదాలు నిర్వహించి అక్రమంగా ఉన్న డబ్బులు సీజ్ చేయాలని కోరారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ వ్యవహారం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ కుట్రలను గుర్తించి, తగిన విధంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

Mohanbabu: మోహన్​బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు