Capgemini మంత్రి నారా లోకేష్..చెప్పిన మాటను నిలబెట్టుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖను రాబోయే పదేళ్లలో ఆ స్థాయికి చేరుస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ఆ దిశగా ప్రయత్నాలు స్పీడప్ చేశారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సేవల దిగ్గజం క్యాప్‌జెమిని సీఈవో ఐమాన్ ఏజత్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో క్యాప్ జెమిని సంస్థ ఏర్పాటుపై చర్చించారు. ఈ సంస్థకు ఇప్పటికే విశాఖ మధురవాడ ఐటీ పార్క్ హిల్ – 1పై 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అడివివరం, ఆనందపురం పరిధిలో రెండు చోట్ల సంస్థ ప్రతినిధులు భూములను పరిశీలించారు.
ఈ సమావేశంలో విశాఖకున్న అడ్వాంటేజ్, అద్భుతమైన మౌలిక వసతులు,లోకల్ టాలెంట్ గురించి లోకేష్ వివరించిన తీరు ఆ సంస్థ ప్రతినిధులను ఆకర్షించింది. ఈ క్యాంపస్ ద్వారా ప్రారంభంలోనే సుమారు 4,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏఐ (AI), క్లౌడ్ టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో ఇక్కడ సేవలు అందించనున్నారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సెంట్రల్ పార్క్ సమీపంలో ఓ భవనాన్ని పరిశీలించారు.
వై నాట్ వైజాగ్..అనే నినాదంతో లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తున్నాయి. ఇప్పటికే TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు విశాఖకు రాగా, ఇప్పుడు IBM, క్యాప్‌జెమిని కూడా తోడవ్వడంతో విశాఖ ఐటీ రంగంలో దూసుకుపోతుంది. ఒకప్పుడు అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ లోకేష్ ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీన్ మారింది.కంపెనీలు అడిగిన వెంటనే స్థల పరిశీలన, భూ కేటాయింపులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఐటీ కంపెనీలకు అవసరమైన టాలెంట్ పూల్‌ను సిద్ధం చేసేందుకు విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లకు ఊతమిస్తూ, ఏపీని నెక్స్ట్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు.
