Hyd Police: కారు బ్లాక్ ఫిల్మ్‌ల‌పై ట్రాఫిక్ పోలీసుల కొర‌ఢా.. హీరోల‌ను వ‌దిలేది లేదంటున్న పోలీసులు

హైద‌రాబాద్‌లో కార్ల‌కు బ్లాక్ ఫిల్మ్‌ల‌పై ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్‌లు నిర్వ‌హిస్తున్నారు. సామాన్యుడి నుంచి సినీ హీరోల వ‌ర‌కు ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌డం లేదు.

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 08:59 AM IST

హైద‌రాబాద్‌లో కార్ల‌కు బ్లాక్ ఫిల్మ్‌ల‌పై ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్‌లు నిర్వ‌హిస్తున్నారు. సామాన్యుడి నుంచి సినీ హీరోల వ‌ర‌కు ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌డం లేదు. బ్లాక్ ఫిల్మ్ ఉన్న ప్ర‌తి ఒక్క కారుకి ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధిస్తున్నారు. ఈ స్పెష‌ల్ డ్రైవ్ లో ప‌లువురు టాలీవుడ్ హీరోలు, డైరెక్ట‌ర్లు పోలీసుల‌కు చిక్కారు. న‌టులు మంచు మ‌నోజ్‌, అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ల కార్ల‌కు పోలీసులు జ‌రిమానా విధించి కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ల‌ను తొలిగించారు. తాజాగా మ‌రో యువ హీరో ఇదే కేసులో పోలీసుల‌కు చిక్కాడు.

అక్కినేని నాగ‌చైత‌న్య కారుకు పోలీసులు జ‌రిమానా విధించారు. టింటెడ్ గ్లాస్ నిబంధనను ఉల్లంఘించినందుకు టాలీవుడ్ నటుడు నాగ చైతన్య కారుపై 700 రూపాయలు జ‌రిమానా వేశారు. అనంతరం అతని కారులోని విండ్ స్క్రీన్‌లపై ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను పోలీసులు తొలగించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద నాగ‌చైత‌న్య కారుని పోలీసులు ఆపారు. పోలీసులు కారును ఆపినప్పుడు నాగ చైత‌న్య కారులో ఉన్నాడు.జ‌రిమానా విధించిన పోలీసులు.. కారు బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. ఆ తర్వాత నాగ‌చైత‌న్య వెళ్లేందుకు అనుమతించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బ్లాక్ ఫిల్మ్, నాసిరకం నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ కేసులు బుక్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని గతంలో పోలీసులు హెచ్చరించారు.