ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతికి కీలక ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2534 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. రూ. 2,534 కోట్లతో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్, జీపీఆర్ఏ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణం కోసం సీపీడబ్ల్యూడీ కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపగా, బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఇందుకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రూ. 1,299.08 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, రూ. 1,234.91 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నివాస సముదాయం (జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కాంప్లెక్స్) నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనంలో కొలువుదీరనున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మల్టీస్టోరీ నివాసాలు నిర్మించనున్నారు.
మరోవైపు అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు కోసం 22.53 ఎకరాలను సీఆర్‌డీఏ ఇప్పటికే కేటాయించింది. 5.53 ఎకరాల్లో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, 17 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తి అయ్యింది. అమరావతిలో ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ అద్దె భవనాల్లో నడుస్తుండగా, సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి అయితే ఇవన్నీ కూడా సెక్రటేరియట్ కాంప్లెక్స్ భవనంలోకి మారనున్నాయి.
సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టును పర్యావరణ హితంగా.. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఐకానిక్ డిజైన్‌తో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్, కాన్ఫరెన్స్ హాల్స్, పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తంగా సెంట్రల్ సెక్రటేరియట్ భవనం రాజధాని అమరావతికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకేచోట చేరడం ద్వారా పాలనలో వేగం పెరగడంతో పాటు, అన్ని సేవలు కూడా ప్రజలకు ఒకే చోట లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరగనుంది.
