Air India: మరో మలుపు తిరిగిన ఎయిరిండియాలో “మూత్ర విసర్జన’ కేసు.. ఆ పని చేసింది తను కాదంటూ?

ఎయిర్‌ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Air India

Air India

Air India: ఎయిర్‌ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసులో కొత్త ట్విస్ట్ అనేది నెలకొంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రా శుక్రవారం ఢిల్లీ కోర్టుకు హాజరై పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. వృద్ధ మృహిళపై తాను మూత్ర విసర్జన చేయలేదని తెలిపారు. తనపై ఇలాంటి ఆరోపణలు చేసిన ఆ వృద్ధురాలు తనపై తానే మూత్రం పోసుకుందని వెల్లడించారు.

శంకర్ మిశ్రా చేసిన ఈ షాకింగ్‌ కామెంట్‌తో కేసులో కొత్త మలుపు తిరిగింది. ఆశ్చర్యకరమైన యూ-టర్న్‌లో తాను ఆ అభ్యంతరకర చర్యకు పాల్పడలేదని శుక్రవారం ఢిల్లీ కోర్టుకు శంకర్ మిశ్రా చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. గత ఏడాది నవంబరు 26న ఎయిర్ ఇండియా న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో ఈ సంఘటన నెట్టింట దుమారం రేపింది. న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తాగుబోతు తన సీటు వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేసినట్లు ఎయిర్‌ ఇండియా చైర్మన్‌కు ఓ మహిళ లేఖ రాసింది.

బట్టలు, బ్యాగులు, బూట్లు పూర్తిగా మూత్రంతో తడిసిపోయాయని ఆ మహిళ లేఖలో తెలుపుతూ ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడు పారిపోయినట్లు ఆమె ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిర్‌ ఇండియా తెలియజేసింది. ఘటనపై దర్యాప్తు కోసం అంతర్గత కమిటీని సైతం ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించింది.

పోలీసులు బెంగళూరులో శంకర్‌ మిశ్రాను అదుపులోకి తీసుకొని ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. నిందితుడి తరపు న్యాయవాది అడిషనల్ సెషన్స్ జడ్జి హర్జ్యోత్ సింగ్ భల్లా కోర్టులో వాదనలు వినిపించారు. నిందితుడుగా ఆరోపించబడిన శంకర్‌ మిశ్రా మూత్ర విసర్జన చేసింది తాను కాదని, ఆ మహిళే మూత్రం పోసుకుందని, ప్రొస్టేట్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని, అలాంటి వారు ఇలా చేసుకోవడం సహజమేనని లాయర్ వాదించాడు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

  Last Updated: 13 Jan 2023, 09:11 PM IST