Site icon HashtagU Telugu

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం..సహాయక చర్యలకు సీఎం ఆదేశం

Accident at SLBC tunnel.. CM orders for relief measures

Accident at SLBC tunnel.. CM orders for relief measures

SLBC Tunnel : సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఎడవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా టన్నెల్‌ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించిన తోటి కార్మికులు హుటాహుటిన జెన్‌కో హాస్పిటల్‌కు తరలించారు. పోలీసుల సాహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: Kamal Haasan : కేంద్రంపై కమల్ ఫైర్

టన్నెల్‌ వద్ద మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. ఆకస్మాతుగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి పడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. వారిలో 42 మంది బయటకి రాగా.. ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలి వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టన్నెల్‌లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటన పై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఘటనాస్థలికి బయల్దేరారు. ఉత్తమ్‌ వెంట నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌, అధికారులు ఉన్నారు.

కాగా, శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్‌ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలో సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు. శ్రీశైలం నుంచి నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌తో సొరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి.

మరోవైపు శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదంపై నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన అక్కడికెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడి చేరుకోనున్నారు.

టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల వివరాలు..

.గుర్‌జీత్‌ సింగ్‌(పంజాబ్‌)
.సన్నీత్‌సింగ్‌(జమ్ముకశ్మీర్‌)
.శ్రీనివాసులు (యూపీ)
.మనోజ్‌ రూబెన(యూపీ)
.సందీప్‌, సంతోష్‌ (ఝార్ఖండ్‌)
.ట్కా హీరన్‌ (ఝార్ఖండ్‌)

Read Also: Indian Fisherme : పాక్‌ జైలు నుండి 22 మంది భారతీయ జాలర్లు విడుదల