Good Friday: క్రైస్తవ మతంలో గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ సండే వరకు ఉన్న మూడు రాత్రులు, మూడు పగళ్లు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ కాలాన్ని క్రైస్తవ సంప్రదాయంలో మానవత్వం, త్యాగం, బాధ, ప్రభువైన యేసు పునరుజ్జీవనం ఆధ్యాత్మిక కథతో ముడిపెడతారు. గుడ్ ఫ్రైడే అనేది యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థం జరుపుకునే రోజు. అదే సమయంలో ఈస్టర్ పండుగను యేసుక్రీస్తు పునరుత్థానానికి (తిరిగి లేవడానికి) గుర్తుగా జరుపుకుంటారు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 3, 2026న, ఈస్టర్ సండే ఏప్రిల్ 5, 2026న జరుపుకుంటారు.
బైబిల్లో స్పష్టంగా పేర్కొనబడకపోయినప్పటికీ మెజారిటీ క్రైస్తవులు అంగీకరించే కాలక్రమం ప్రకారం.. యేసు శుక్రవారం మధ్యాహ్నం మరణించారని, తదుపరి ఆదివారం సూర్యోదయ సమయంలో తిరిగి జీవించారని నమ్ముతారు. పునర్జన్మ తర్వాత ఆయన 40 రోజుల పాటు ప్రజల మధ్య ఉండి పరలోకానికి వెళ్లారు.
గుడ్ ఫ్రైడే (Good Friday)- త్యాగం, సిలువ వేయబడిన రోజు
క్రైస్తవ మతంలో గుడ్ ఫ్రైడే అత్యంత భావోద్వేగభరితమైన రోజు. రోమన్ పాలకుల ఆదేశం మేరకు ప్రభువైన యేసును ఇదే రోజున సిలువ వేసినట్లు నమ్ముతారు. అంతకుముందు ఆయనను కొరడాలతో కొట్టి, ముళ్ల కిరీటాన్ని ధరింపజేసి, చివరకు యెరూషలేములోని గొల్గొత్తా కొండపై సిలువ వేశారు. మానవాళి పాపాల కోసం ఆయన చేసిన ఈ అత్యున్నత త్యాగాన్ని స్మరిస్తూ ఈ రోజున చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చాలా మంది ఉపవాసం ఉండి యేసు బలిదానాన్ని గుర్తు చేసుకుంటారు.
హోలీ సాటర్డే- మౌనం, నిరీక్షణ రోజు
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మధ్య వచ్చే శనివారాన్ని ‘హోలీ సాటర్డే’ అంటారు. ఇది శోకం, మౌనం, నిరీక్షణకు ప్రతీక. ఈ రోజున క్రైస్తవులు ప్రశాంతంగా ప్రార్థనలు చేస్తూ, ధ్యానంలో గడుపుతారు.
Also Read: రామాయణ మూవీలో లక్ష్మణుడి పాత్ర చేసింది ఎవరంటే?
ఈస్టర్ సండే- పునరుజ్జీవనం, నిరీక్షణ రోజు
క్రిస్మస్ తర్వాత క్రైస్తవ మతంలో ఇది అత్యంత ముఖ్యమైన పండుగ. విశ్వాసం ప్రకారం.. శుక్రవారం సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఆదివారం నాడు తిరిగి ప్రాణంతో లేచారు. పునరుత్థానం తర్వాత 40 రోజుల పాటు ఆయన తన శిష్యులకు, అనుచరులకు మానవత్వం, సత్యం, ధర్మం గురించి బోధించి, ఆపై పరలోకానికి చేరుకున్నారు. ఈ రోజును యేసు పునర్జన్మ సంతోషకరమైన పండుగగా జరుపుకుంటారు.
ఈ 3 రోజుల ప్రాముఖ్యత
గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ సండే వరకు జరిగిన సంఘటనలు లోతైన సందేశాన్ని ఇస్తాయి.
గుడ్ ఫ్రైడే: త్యాగం, క్షమాగుణాన్ని బోధిస్తుంది.
హోలీ సాటర్డే: ఓర్పు, విశ్వాసం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ఈస్టర్ సండే: కొత్త ఆశను, మరణంపై విజయాన్ని (పునర్జన్మను) చాటిచెబుతుంది.
