Site icon HashtagU Telugu

INDIA Win 2024 : ఈ 3 సవాళ్లను అధిగమిస్తే.. “ఇండియా”దే గెలుపు!

India Win 2024

India Win 2024

INDIA Win 2024 : కాంగ్రెస్ నేతృత్వంలోని  “ఇండియా” (ఇండియన్ నేషనల్ డెవలప్‌ మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమి ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) కూటమిని ఎన్నికల్లో ఎదుర్కొనే ముందు.. ఆ సవాళ్ళను “ఇండియా” (INDIA) కూటమి కలిసికట్టుగా అధిగమించాలి.

ఎన్నికల దాకా ఏకమై ప్రయాణాన్ని సాగించాలి..

ఇంతకీ ఆ సవాళ్లు ఏమిటో ఒకసారి చూద్దాం..  

1. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ? 

ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై ‘ఇండియా’ (INDIA) కూటమికి ఇంకా క్లారిటీ లేదు. ఆ కూటమిలోని పార్టీలకు ఈవిషయంపై ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణం. ఈనేపథ్యంలో ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్రధానమంత్రి అభ్యర్థిని  అప్పటికప్పుడు నిర్ణయించాలని బెంగళూరులో జరిగిన విపక్షాల మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది.  అయితే కూటమిలోని కొన్నిపార్టీల నేతలు తమ అధినేతలకు ప్రధాని పోస్టును ఇవ్వాలనే డిమాండ్ ను తరుచూ మీడియా ముందు వినిపిస్తున్నారు. ఈనెల 18న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని అభ్యర్థిత్వం ఇవ్వాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవిపై ఆసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన ప్రకటనను ఈసందర్భంగా శతాబ్ది రాయ్  ప్రస్తావించారు.  కాంగ్రెస్ కు పీఎం పోస్టుపై ఆసక్తి లేకుంటే ఆ అభ్యర్థిత్వాన్ని తమ పార్టీ (తృణమూల్ కాంగ్రెస్) అధినేత్రి మమతా బెనర్జీకి ఇవ్వాలన్నారు. గతంలో జేడీయూకి చెందిన ఒక నాయకుడు.. తమ పార్టీ అధినేత నితీష్ కుమార్ ను విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కోరాడు. ఈ ప్రకటనల వెనుక ఆయా పార్టీల అధినేతలు ఉన్నారా ? లేదా ? అనేది అటుంచితే ఇటువంటి ముఖ్యమైన అంశాలపై బహిరంగ చర్చ “ఇండియా” (INDIA) కూటమికి మైనస్ పాయింట్ గా మారొచ్చు. దీన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు బీజేపీ వెనుకాడదు.

Also read : Bandi Sanjay Follower: బండి సంజయ్ అనుచరుడు సొల్లు అజయ్ వర్మ ఆత్మహత్యాయత్నం

2.పెద్ద ఛాలెంజ్..  ఓట్ల బదిలీ 

రాజకీయ పార్టీల నాయకులు కలిసి నడిచినా.. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు కలిసి పనిచేసేలా చేయడం పెద్ద ఛాలెంజ్. రాష్ట్ర స్థాయిలో విభేదాలను పక్కన పెట్టి.. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం, ఉమ్మడి ప్రచారం విపక్షాలకు కత్తిమీద సాముగా మారే ప్రమాదం ఉది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు కాంగ్రెస్, వామపక్షాల ఓట్లు బదిలీ అవుతాయన్న నమ్మకం లేదు. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు సహకరించడం గగనమే. కేరళలో తమ ప్రధాన ప్రత్యర్థి వామపక్షాల అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తారని ఆశించడం ఊహాజనితమే. దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ సీట్లున్నఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీల క్యాడర్ కలిసి నడవడం పెద్ద ఛాలెంజే. ఇలా.. కూటమి భాగస్వామ్య పక్షాలు పాలిస్తున్న 11 రాష్ట్రాల్లో ఓట్లు చీలకుండా తమ వైపునకు తిప్పుకోవడం కాంగ్రెస్‌కు కత్తిమీద సాముగా మారే అవకాశం ఉంది. మిత్రపక్ష పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం ముఖ్యమైనది. గతంలో విపక్షాలుగా ఉండి.. ఇప్పుడు మిత్రపక్షాలుగా మారిన పార్టీలు తమ బలమైన క్యాడర్‌ను  ఒప్పించడం లేదా కనీసం వ్యతిరేకించకుండా చూడటం కష్టమైన పనే.

Also read :Rain Water: వరుస అప్పులతో సతమతమవుతున్నారా.. అయితే వర్షపు నీటితో ఇలా చేయాల్సిందే?

3. ప్రచారాస్త్రం కావలెను 

జాతీయ స్థాయిలో తమ కూటమిని ఎన్డీయేకు, మోడీకి  ప్రత్యామ్నాయంగా చూపించాలంటే.. ‘ఇండియా’ భాగస్వామ్య పార్టీల దగ్గర ఒక ప్రచారాస్త్రం ఉండాలి. అప్పుడే.. ఎన్డీయేపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచి ‘ఇండియా’ కూటమి అధికారం సాధించగలుగుతుంది.  దేశంలో పలుచోట్ల హింసాకాండ, మూక దాడులు, నిత్యావసరాల ధరల మంట, కొందరు వ్యాపార దిగ్గజాలకు బీజేపీ సర్కారు సహాయ సహకారాలు వంటి అంశాలను విపక్ష కూటమి లేవనెత్తుతోంది. ఇవి ముఖ్యమైనవే. అయితే యావత్ దేశాన్ని ఇండియా కూటమి వైపు చూసేలా చేయగలిగే ఒక బలమైన ప్రచార అస్త్రాన్ని అన్వేషించాలి. అదే విపక్ష కూటమిని విజయం దిశగా నడుపుతుంది.

Also read : Manipur Women Naked Parade : నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల కుటుంబాల గుండెగోడు ఇదీ