Chandra Shekhar Azad: మన దేశం గర్వించే స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్. ఇవాళ (ఫిబ్రవరి 27) ఆయన వర్ధంతి. ఈసందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ ఆదర్శప్రాయ జీవితంలోని కీలక విశేషాలివీ..
Also Read :Drone To Moon : చంద్రుడిపైకి తొలిసారిగా డ్రోన్.. ఎందుకో తెలుసా ?
చంద్రశేఖర్ ఆజాద్ జీవిత విశేషాలు
- చంద్రశేఖర్ ఆజాద్(Chandra Shekhar Azad) మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమరులయ్యారు.
- ఆయన 1906 సంవత్సరం జులై 23న మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా భాబ్రాలో జన్మించారు.
- చంద్రశేఖర్ చిన్న వయసు నుంచే దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.
- 1922లో చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీజీ తన ఉద్యమాన్ని కొంత కాలం పాటు ఆపేశారు. దీంతో నాటి భారత జాతీయ కాంగ్రెస్ తీరుపై ఆజాద్ నిరాశచెందారు.
- ఈనేపథ్యంలో పండిట్ రాంప్రసాద్ బిస్మిల్, సచింద్రనాథ్ సన్యాల్, యోగేష్ చంద్ర ఛటర్జీ ఏర్పాటు చేసిన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో 1924లో చేరారు.
- 1925లో రాంప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలో జరిగిన కకోరీ ఘటనలో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
- చంద్రశేఖర్ 1928లో లాహోర్‌లో బ్రిటీష్ పోలీసు అధికారి ఎస్పీ సాండర్స్‌ను కాల్చి చంపారు. తద్వారా లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నారు.
- బ్రిటిష్ ఖజానాను చంద్రశేఖర్ దోచేసి, ఆ డబ్బును హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు అందించారు. వీటిని విప్లవ పోరాటానికి వినియోగించేవారు. ఈ సంపద భారతీయులదే అని, దాన్ని బ్రిటిష్ వారు దోచుకున్నారని చంద్రశేఖర్ పదేపదే చెప్పేవారు.
- చంద్రశేఖర్‌కు ‘ఆజాద్’ అనే పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఆయన 15 ఏళ్ల వయసులో ఒక కేసులో బ్రిటీష్ జడ్జి ఎదుట హాజరయ్యారు. పేరు చెప్పమని జడ్జీ అడగగా.. ‘‘నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు ఇండిపెండెన్స్, నా ఇల్లు జైలు’’ అని బదులిచ్చారు. ఆ మాట విన్న బ్రిటీష్ జడ్జి కోపంతో చంద్రశేఖర్‌కు 15 కొరడా దెబ్బల శిక్షను విధించారు. నాటి నుంచే చంద్రశేఖర్ పేరులో ఆజాద్ చేరిపోయింది.
- అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్ వేదికగా సుఖ్‌దేవ్, అతని ఇతర సహచరులతో చంద్రశేఖర్ ఆజాద్ సమావేశమయ్యారు. వారంతా కలిసి స్వాతంత్య్ర పోరాట ప్రణాళికలపై డిస్కస్ చేస్తున్నారు. ఈవిషయం తెలిసి అక్కడికి వచ్చిన బ్రిటీష్ పోలీసులు చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపారు. దీంతో ఆజాద్ తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలో బ్రిటీష్ వాళ్లకు దొరికిపోవడం ఏమాత్రం ఇష్టంలేని ఆజాద్.. తన పిస్టల్‌తో తానే కాల్చుకొని ప్రాణాలను అర్పించారు.
- 1931 సంవత్సరం ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ ఆజాద్ తుదిశ్వాస విడిచారు.