Site icon HashtagU Telugu

Black Warrant Team interview : ‘బ్లాక్ వారెంట్’‌ డైరెక్టర్, రచయితలతో సంచలన ఇంటర్వ్యూ.. ఏం చెప్పారంటే ?

Black Warrant Team Interview  vikramaditya Motwane Sunil Gupta And Sunetra Choudhury

Black Warrant Team interview : ‘బ్లాక్ వారెంట్’ వెబ్ సిరీస్ పార్ట్ 1 నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇవాళ విడుదలైంది. ప్రముఖ జర్నలిస్ట్ సునేత్రా చౌదరి, తిహార్ జైలు మాజీ సూపరింటెండెంట్ సునీల్ గుప్తా కలిసి రాసిన ‘బ్లాక్ వారెంట్ : కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తిహార్ జైలర్’ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను విక్రమాదిత్య మోత్వానీ తెరకెక్కించారు. సునీల్ గుప్తా తిహార్ జైలులో 35 ఏళ్ల పాటు జైలర్‌గా సేవలు అందించారు. ఈ సుదీర్ఘ వ్యవధిలో ఛార్లెస్ శోభ్‌రాజ్, అఫ్జల్ గురు  లాంటి హైప్రొఫైల్ నేరగాళ్లను దగ్గరి నుంచి ఆయన పరిశీలించారు.  ఈ పరిశీలన ఆధారంగా జర్నలిస్ట్ సునేత్రా చౌదరితో కలిసి సునీల్ గుప్తా పుస్తకాన్ని రాశారు.  ఓ ఇంటర్వ్యూలో(Black Warrant Team interview)  ‘బ్లాక్ వారెంట్’ వెబ్ సిరీస్ గురించి విక్రమాదిత్య మోత్వానీ,  సునీల్ గుప్తా, సునేత్రా చౌదరి చెప్పిన వివరాలివీ..

Also Read :Donations To Regional Parties : ప్రాంతీయ పార్టీలకు రూ.200 కోట్ల విరాళాలు.. టీడీపీ, బీఆర్ఎస్‌ తడాఖా

ప్రశ్న : విక్రమ్.. ‘బ్లాక్ వారెంట్ : కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తిహార్ జైలర్’ పుస్తకంలోని కథను స్క్రీన్‌పై చూపించాలని ఎందుకు అనుకున్నారు ?

విక్రమాదిత్య మోత్వానీ :   ఆధునిక చరిత్రపై ఆ పుస్తకం ఒక స్పెషల్ ఫోకస్ లాంటిది. పుస్తక రచయిత సునీల్ గుప్తా తిహార్ జైలులో జైలర్‌గా 35 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఈ సుదీర్ఘ కాలంలో ఎదుర్కొన్న అనుభవాలను, చూసిన ఘటనల సమాచారాన్ని ఆయన పుస్తకంలో పొందుపరిచారు. అందులోని అంశాలన్నీ నిజమైనవే. అందుకే వాటిని కథాంశంగా చేసుకొని సినిమా తీశాం.

ప్రశ్న : అమెరికా జైళ్ల వ్యవస్థ గురించి చాలా సినిమాలు గతంలో వచ్చాయి. భారతదేశపు జైళ్లలో ఏం జరుగుతోంది ? ఇక్కడి జైళ్లలో ఎలాంటి విధివిధానాలు ఉంటాయి అనేది నేటికీ చాలామందికి తెలియదు

విక్రమాదిత్య మోత్వానీ :  అవును.. అమెరికాలోని జైళ్లపై తీసిన ‘షా శంక్ రిడెంప్షన్’ సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇప్పటిదాకా ఆ రేంజులో భారతీయ జైళ్ల వ్యవస్థ గురించి సినిమాలు రాలేదు. ‘బ్లాక్ వారెంట్’ వెబ్ సిరీస్ ద్వారా ఆ లోటును మేం పూడ్చాం.

Also Read :Interpol Silver Notice : తొలిసారిగా ఇంటర్‌పోల్ ‘సిల్వర్ నోటీసులు’.. ఏమిటివి ? ఇంకెన్ని నోటీసులుంటాయ్ ?

ప్రశ్న : సునీల్..  మీరు సుదీర్ఘ కాలం పాటు తిహార్ జైలులో జైలర్‌గా పనిచేశారు. బిల్లా రంగ, ఛార్లెస్ శోభరాజ్, అఫ్జల్ గురు లాంటి వాళ్లను సమీపం నుంచి చూశారు. మీకు అసలు పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది ?

సునీల్ గుప్తా :  నేను 2016 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. ప్రజలకు నేను చెప్పాల్సింది చాలా ఉందని భావించాను. జైలు అనేది బయట ఉన్న వారికి తెలియని రహస్య ప్రపంచం. లోపల ఏం జరుగుతోందో ఎవరూ తెలుసుకోలేరు. జైలు అధికారులు మీడియా సమావేశాల్లో చెప్పేదే ఫైనల్. వాస్తవానికి అంతకంటే ఎక్కువే జైలు గోడల వెనుక జరుగుతుంటుంది. అందుకే నేను నిజాలను చెప్పాలనే ఉద్దేశంతో పుస్తకం రాశాను.

‘‘మరణశిక్ష పడిన చాలామంది ఖైదీలను నేను చూశాను. హైప్రొఫైల్ ఖైదీలను ఉరితీస్తుంటే కళ్లారా చూశాను. ఉరితీస్తుంటే ఆయా నేరగాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా నేను పుస్తకంలో వివరించాను. సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టు కూడా నా పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నాయి. కొన్ని తీర్పులలో నా పుస్తకంలోని పలు అంశాలను న్యాయస్థానంలో ప్రస్తావించాయి. జైళ్ల వ్యవస్థలోని లోపాలను కూడా నేను బయటపెట్టాను’’ అని సునీల్ గుప్తా వివరించారు.

ప్రశ్న : సునేత్ర.. మీరు ‘బిహైండ్ బార్స్ : ప్రిజన్ టేల్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ ఫేమస్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు కదా.. కొందరు హైప్రొఫైల్ ఖైదీలను ఇంటర్వ్యూ చేసిన వివరాలను మీరు ఆ పుస్తకంలో ప్రస్తావించారు. మీ మొదటి పుస్తకంలోని కథాంశం, రెండో పుస్తకంలోని కథాంశం పరస్పర విరుద్ధమైనవి కదా..

సునేత్రా చౌదరి : మీరే ఆ విషయాన్ని గుర్తించాలి. 1999 నాటికే నాకు సునీల్ గుప్తా పరిచయం. 2016లో ఆయన రిటైర్ అయ్యారు. తిహార్ జైలుకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అప్పట్లోనే చాలామంది జర్నలిస్టులు సునీల్ గుప్తాను ఆశ్రయిస్తుండేవారు. నాటి నుంచే నేను ఆయన్ను గమనించాను. తిహార్ జైలులోని వాస్తవాలను బయటపెట్టగల వ్యక్తిగా సునీల్ గుప్తా నాకు కనిపించారు. జైలుగోడల వెనుక జరిగిన ఘర్షణలు, ఆధిపత్య పోరాటాలను సునీల్ కళ్లకు కట్టేలా పుస్తకంలో రాశారు. నిజాయితీగా ప్రజలకు వాస్తవాలను ఆయన తెలియజేసిన తీరు అమోఘం.

ప్రశ్న : ‘బ్లాక్ వారెంట్ : కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తిహార్ జైలర్’ పుస్తకాన్ని రాసే క్రమంలో ఏవైనా అంశాలు వివాదాలకు  దారితీస్తాయని భావించారా ?

సునేత్రా చౌదరి : నేను ఈ పుస్తకానికి రచయిత్రిని. ప్రొఫెషనల్‌గా ఒక జర్నలిస్టును కూడా కావడంతో నా రచనా శైలి ఆద్యంతం పాఠకుడికి ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది.  తిహార్ జైలులో కొందరు వ్యక్తులు ఎదుర్కొన్న అనుభవాలు, వారి భావోద్వేగాలను సునీల్ గుప్తా గారు చెప్పినట్టుగా రాశాను. ఈక్రమంలో ఒక జర్నలిస్టుగా ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగి అదనపు వివరాలను తెలుసుకున్నాను. బిల్లా, రంగాలకు తిహార్ జైలులో ఉరివేశారని సునీల్ గుప్తా గారు చెబితే.. నేను ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగాను. ఆ సమయంలో బిల్లా, రంగాల  భావోద్వేగం ఎలా ఉంది ? వారి మానసిక స్థితి ఎలా ఉంది ? అంతకుముందు కొన్ని రోజుల పాటు జైలులో ఎలా గడిపారు ? ఎవరితో మాట్లాడారు ? అనే సమాచారాన్ని తెలుసుకున్నాను. వాటన్నింటిని పుస్తకంలో యాడ్ చేశాను. ఇందులో వివాదానికి తావు లేదు.

ప్రశ్న : విక్రమ్.. బ్లాక్ వారెంట్ సినిమాలో మీకు ఆందోళన కలిగించే  భాగాలు ఏవైనా ఉన్నాయా ?

విక్రమాదిత్య మోత్వానీ :  లేవు.. తిహార్ జైలులో జైలర్‌గా సునీల్ గుప్తా 35 ఏళ్ల అనుభవాన్ని 200 పేజీల్లోనే ఈ పుస్తకంలో పొందుపరిచారు. దాన్ని సినిమాలో సవివరంగా చూపించేందుకు మేం ప్రయత్నించాం.

ప్రశ్న : జహాన్ కపూర్‌నే సునీల్ గుప్తా పాత్రకు ఎందుకు ఎంచుకున్నారు ?

విక్రమాదిత్య మోత్వానీ : వాస్తవానికి నేను జహాన్ కపూర్‌ను ఎన్నడూ నేరుగా కలవలేదు. కానీ ఆడిషన్ పూర్తయ్యాక.. ఆడిషన్ వీడియోను మేమంతా కలిసి కూర్చొని చూశాం. అందులో జహాన్‌‌ను చూడగానే వెంటనే ఆపమన్నాను. అతడే సునీల్ గుప్తా పాత్రకు సరిపోతాడని చెప్పాను. జహాన్ కళ్లు నాకు బాగా నచ్చాయి.

ప్రశ్న : సునీల్..  తిహార్ జైలులో మీ 35 ఏళ్ల కెరీర్‌ను అద్దంపట్టే ఏదైనా ఒక ఘటన లేదా  ఒక ఫొటో ఉందా ?

సునీల్ గుప్తా :  తిహార్ జైలులో ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో నేను పిరికిగా ఉండేవాడిని. క్రమంగా ఆ ఉద్యోగంలో ఇమిడిపోయాను. ఖైదీలను నేను అతిథుల్లా చూసేవాడిని. వాళ్లతో మానవీయంగా ప్రవర్తించేవాడిని. నా కుటుంబసభ్యుల్లా వాళ్లను చూసేవాడిని.

ప్రశ్న : ఎలాంటి నేరాలు చేసి వచ్చినా.. వాళ్లతో మీరు బాగానే ఉండేవారా ?

సునీల్ గుప్తా : మనం నేరాన్ని ద్వేషించాలి. నేరస్తున్ని కాదు. జైలు ఫిలాసఫీ చెప్పేది అదే. ఖైదీల సహకారం లేనిదే జైలు సిబ్బంది తమ విధులను నిర్వర్తించలేరు. ఖైదీలు మా రోజువారీ విధుల్లో ఒక తప్పనిసరి భాగం.  ఈ సమయంలో మేం వాళ్ల నేరాల గురించి ఆలోచిస్తూ కూర్చోలేం.