Mysuru Dasara : ఈరోజు (అక్టోబరు 3) నుంచి ఈనెల 12 వరకు కర్ణాటకలో మైసూరు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక అలంకరణతో కూడిన గజరాజులే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చాముండేశ్వరి దేవి విగ్రహంతో 750 కిలోల బరువున్న బంగారు హౌడా (కవర్ సీటు)ను ఏనుగు తన వీపుపై తీసుకెళ్లడాన్ని అందరూ భక్తిభరితంగా తిలకిస్తుంటారు. ఈనెల 12న ఈ ప్రతిష్ఠాత్మక ఊరేగింపు జరుగుతుంది. గత నెల 20న రాత్రి మైసూర్ ప్యాలెస్ (Mysuru Dasara) వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు ధనంజయ, కంజన్ పొట్లాడుకున్నాయి. ఈక్రమంలో అవి పరిసర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. మావటివాడు ఉన్నా.. వాటిని కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో రోడ్లపై జనం భయంతో పరుగులు తీశారు. ఎట్టకేలకు కొంత సమయం తర్వాత వాటిని శాంతింపజేశారు.
గత 22 ఏళ్లుగా మైసూరు దసరా ఉత్సవాల్లో అర్జున్ అనే ఏనుగు పాల్గొంటోంది. అయితే ఈ ఉత్సవాల్లో అది పాల్గొనదు. దీనికి ఒక విషాదకరమైన కారణం ఉంది. అదేమిటంటే.. 64 ఏళ్ల వయసులో ఏనుగు అర్జున్ చనిపోయింది. మైసూరు ప్రజలకు సుపరిచితమైన ఆ ఏనుగు 2023 డిసెంబర్‌లో చనిపోయింది. అయితే దానికి సహజమైన మరణం రాలేదు. కర్ణాటకలోని అడవుల్లో పెద్ద సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి. అడవుల సమీపంలోని గ్రామాలు, పంట పొలాలపై ఆ ఏనుగులు అకస్మాత్తుగా దాడులు చేస్తుంటాయి. ఇలాంటి అడవి ఏనుగులను కంట్రోల్ చేయడానికి మచ్చిక చేసిన ఏనుగులను కర్ణాటక అటవీశాఖ వినియోగిస్తోంది.
Also Read :Smita Sabharwal : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ రియాక్షన్
ఈక్రమంలోనే కొన్ని అడవి ఏనుగులను పట్టుకునే ఆపరేషన్ కోసం ఏనుగు అర్జున్‌ను తీసుకెళ్లారు. అయితే అక్కడున్న అటవీ ఏనుగులు ఎంతకూ కంట్రోల్‌లోకి రాలేదు. అటవీశాఖ అధికారులు, మావటి వాళ్లు కలిసి తీసుకెళ్లిన పెంపుడు ఏనుగులపై దాడికి దిగాయి. ఈ భయంతో అక్కడి నుంచి అధికారులు, మావటి వాళ్లు పరార్ కావాల్సి వచ్చింది. అయితే పాపం.. అర్జున్ సహా పలు పెంపుడు ఏనుగులు మాత్రం ఈ దాడిలో ప్రాణాలు వదిలాయి.
అటవీ ఏనుగులు వర్సెస్ పెంపుడు ఏనుగులు
అటవీ ఏనుగులను పట్టేందుకు ఈవిధంగా పెంపుడు ఏనుగులను వాడటంపై ఇప్పుడు జంతు ప్రేమికులు, జంతు పరిరక్షణ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఒక జంతువుతో మరో జంతువును పట్టే ప్రయత్నం చేయడం సరికాదని సూచిస్తున్నారు. అడవులను వదిలి సమీప పల్లెల్లో, పంట పొలాల్లోకి ఏనుగులు ఎందుకు వస్తున్నాయనే కారణాలను తెలుసుకుంటే మంచిదని పరిశీలకులు కోరుతున్నాారు. ఏనుగుల ప్రమేయం లేకుండా అటవీ ఏనుగులను పట్టేందుకు గతంలో ఖేడా అనే పద్దతిని వినియోగించేవారు. తాజా ఘటనల నేపథ్యంలో ఖేడా పద్ధతిని తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఖేడా పద్ధతిలో పెద్ద గుంతలు తవ్వి వాటిలో ఏనుగులు పడిపోయేలా చేస్తారు. అనంతరం వాటికి మేత పెట్టి మచ్చిక చేసుకుంటారు.
రంగంలోకి అభిమన్యు
అర్జున్ ఏనుగు చనిపోవడంతో ఈసారి మైసూరు దసరా ఉత్సవాల్లో అభిమన్యు అనే ఏనుగు అమ్మవారి సవారీని వీపుపై మోయనుంది. ఇందుకోసం ఆ ఏనుగుకు గత నెలలోనే మావటి వాడు ట్రైనింగ్ మొదలుపెట్టాడు. అభిమన్యు బరువు 5,560 కిలోలు.