Liquor Shops: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు-రాజకీయవేత్త జోసెఫ్ విజయ్, తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను (టాస్మాక్) తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తమిళనాడులో మొత్తం 4,765 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో మూసివేయనున్న 717 షాపుల్లో.. 276 ప్రార్థనా […]

Published By: HashtagU Telugu Desk
Vijay Takes Sensational Decision

Vijay Takes Sensational Decision

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు-రాజకీయవేత్త జోసెఫ్ విజయ్, తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను (టాస్మాక్) తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం తమిళనాడులో మొత్తం 4,765 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో మూసివేయనున్న 717 షాపుల్లో.. 276 ప్రార్థనా స్థలాల దగ్గర, 186 విద్యాసంస్థల దగ్గర, 255 బస్టాండ్ల దగ్గర ఉన్నట్టు గుర్తించారు. సున్నితమైన ప్రాంతాల్లో మద్యం లభ్యతపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సామాజిక సంస్కరణ చర్య చేపట్టినట్లు కొత్త ప్రభుత్వం పేర్కొంది.

ఇదే క్రమంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై కూడా విజయ్ సంతకం చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక దళం, ప్రతి జిల్లాలో యాంటీ-డ్రగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

అయితే, ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ చేసిన అత్యంత కీలకమైన ప్రకటన డీఎంకేను లక్ష్యంగా చేసుకుంది. 2021-2026 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. “రాష్ట్రం రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది, ఖజానా పూర్తిగా ఖాళీ అయింది” అని తన తొలి ప్రసంగంలో విజయ్ ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అతిపెద్ద పార్టీగా అవతరించి, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

  Last Updated: 12 May 2026, 09:29 AM IST