ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో స్విగ్గీకి ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసినట్టు శనివారం వెల్లడించింది. గడువు ముగిసిన, పాడైపోయిన, కుళ్లిపోయిన, కలుషితమైన, అసురక్షిత ఆహార పదార్థాలను తమ ప్లాట్‌ఫామ్ ద్వారా సరఫరా చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లో ఆమోదం లేని బ్రాండ్ పేరుతో గుడ్లను విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని రెగ్యులేటరీ సంస్థ పేర్కొంది. సరైన లైసెన్స్ పొందే వరకు ఆ ఉత్పత్తిని మార్కెట్ చేయవద్దని ‘ఫుడ్ బిజినెస్ ఆపరేటర్’ (ఎఫ్‌బీఓ) అయిన స్విగ్గీని ఆదేశించింది. అంతేకాకుండా ‘హెల్తీఫై 100% వే ప్రోటీన్ 1 కేజీ’, ‘నాయిస్ హోమ్‌స్టైల్ మద్రాస్ మిక్చర్ విత్ పీనట్స్’ వంటి ఉత్పత్తులను వాటి గడువు తేదీ ముగిసిన తర్వాత కూడా వినియోగదారులకు సరఫరా చేసినట్టు వచ్చిన ఫిర్యాదులను కూడా నోటీసుల్లో ప్రస్తావించింది.
మరో తీవ్రమైన ఘటనలో.. ‘అక్షయకల్ప ఆర్గానిక్ ఎగ్’ గడువు ముగిసి, కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతూ, కలుషితమైనట్టుగా గుర్తించారు. ఇది మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాదని తేలింది. అదేవిధంగా, ‘కక్కే దా పరాఠా’ అనే ఉత్పత్తి కూడా పాడైపోయి, దుర్వాసనతో ఉన్నట్టు ఫిర్యాదు అందింది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, శిశువుల కోసం ఉద్దేశించిన ఒక ఫుడ్ ఫార్ములేషన్ పాడైపోయిందని వినియోగదారుడు వెనక్కి పంపితే, అదే ఉత్పత్తిని మళ్లీ తిరిగి సరఫరా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు చేసినప్పటికీ స్విగ్గీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.
ఈ ఘటనల నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర వివరణ ఇవ్వాలని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలు, నాణ్యత హామీ వ్యవస్థలు, దిద్దుబాటు చర్యల వివరాలను సమర్పించాలని కోరింది. నిర్దేశిత గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో విఫలమైతే.. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006’ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టంగా హెచ్చరించింది.
