Actress Harassment: కేరళ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్న ఒక పెద్ద వివాదం వెలుగులోకి వచ్చింది. మలయాళ సినీ నటి రిని జార్జ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఆరోపణలతో నేరుగా అనుసంధానం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడి పదవికి రాజీనామా చేయడం ఈ వివాదానికి మరింత ఊపునిచ్చింది.
ఇటీవల ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిని జార్జ్, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు తనను మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని బహిరంగంగా ఆరోపించారు. మొదట సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత నుండి వరుసగా అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని ఆమె తెలిపారు. అంతేకాకుండా, “ఫైవ్ స్టార్ హోటల్‌లో గది బుక్ చేశాను, అక్కడికి రమ్మని పిలుపు ఇచ్చాడు” అని ఆమె చేసిన ఆరోపణలు మరింత దుమారం రేపాయి. ఈ విషయంపై పార్టీ సీనియర్ నేతలకు తాను పలు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదని, పైగా ఆ నేతకే వరుస పదవులు కట్టబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. ఎవరూ పట్టించుకోరు” అంటూ ఆ నేత తనను బెదిరించాడని కూడా రిని జార్జ్ చెప్పారు.
ఈ ఆరోపణలు బయటకొచ్చిన వెంటనే కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, ప్రతిపక్షమైన బీజేపీ నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌నే ఈ వివాదానికి కారణమని ఆరోపించింది. పాలక్కాడ్‌లోని ఆయన కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులు – పోలీసులు మధ్య ఉద్రిక్తత నెలకొంది.
Online Gaming Bill: లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం.. ప్రముఖ బెట్టింగ్ యాప్‌లపై నిషేధం?!
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ తీవ్రంగా ఖండించారు. “నా మీద ఇప్పటి వరకు ఎలాంటి లీగల్ ఫిర్యాదు నమోదుకాలేదు. నాపై ఆరోపణలు చేస్తున్న వారు కోర్టులో నిరూపించుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, వివాదం మరింత ముదరకుండా ఉండేందుకు యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక మరోవైపు నటి రిని జార్జ్ మాత్రం తన వైఖరిని మార్చకపోగా, “నేను కేవలం నా తరఫుననే కాకుండా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న ఇతర మహిళల తరఫున కూడా మాట్లాడుతున్నాను” అని స్పష్టం చేశారు. వ్యవస్థపై నమ్మకం లేకపోవడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని ఆమె తెలిపారు.
ఈ సంఘటనపై కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా స్పందించారు. “నటి చేసిన ఆరోపణలు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మేము దృష్టి సారించాం. తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం” అని ఆయన ప్రకటించారు.
సినీ నటి ఆరోపణలతో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో నైతికత, మహిళల భద్రత, వ్యవస్థపై నమ్మకం వంటి అంశాలపై చర్చకు దారి తీసింది. రాహుల్ మమ్‌కూటథిల్ రాజీనామా చేసినప్పటికీ, ఈ ఘటనకు రాజకీయ పరిమాణం ఎంతవరకు పెరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ దీనిని ఎలా ఎదుర్కుంటుందో అన్నది చూడాల్సి ఉంది.