One Nation One Election : ఈసారి కేంద్ర ప్రభుత్వ పాలనా కాలం ముగిసేలోగా ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలనే పట్టుదలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారు. అయితే ఇందుకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు బలంగా గళం వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మరో రాష్ట్రం చేరింది. తాజాగా ఇవాళ ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. దేశంలో జమిలి ఎన్నికల పద్ధతిని అమలు చేయొచ్చంటూ మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సారథ్యంలోని హైలెవల్ కమిటీ చేసిన సిఫార్సులను తమ రాష్ట్రం వ్యతిరేకిస్తున్నట్లు ఈ తీర్మానంలో ప్రస్తావించారు.
Also Read :Mallareddy : బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి.. కిషన్ రెడ్డితో భేటీ
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ అసెంబ్లీ (One Nation One Election) కోరింది. జమిలి ఎన్నికల విధానం అప్రజాస్వామికమైందని పేర్కొంది. కేరళ సీఎం పినరయి విజయన్ తరఫున రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి మెజారిటీ సభ్యులు మద్దతు తెలపడంతో ఆమోదం లభించింది. జమిలి ఎన్నికల విధానం వల్ల దేశంలోని సమాఖ్య వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ అసెంబ్లీలో బీజేపీకి శాసనసభ్యుడు ఒక్కరు కూడా లేరు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది.
Also Read :Crorepati MLAs : 90 మంది ఎమ్మెల్యేల్లో 86 మంది కోటీశ్వరులే.. సగటు ఆస్తి పాతిక కోట్లు
దేశంలోని రాష్ట్రాలు, స్థానిక సంస్థల స్వపరిపాలన హక్కులకు విఘాతం కలిగించేలా జమిలి ఎన్నికల విధానం ఉందని కేరళ అసెంబ్లీ పేర్కొంది. దేశంలో అధికార కేంద్రీకరణ జరగాలనేది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎజెండా అని కేరళ సర్కారు అభిప్రాయపడింది. దేశంలోని ప్రజాస్వామిక భావనను దెబ్బతీసేలా జమిలి ఎన్నికల విధానం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.