Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్‌లోని ప్రఖ్యాత పుంగోల్ జిల్లా తరహాలో ఒక భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఈ టౌన్‌షిప్ కేవలం రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికే ఒక మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్‌సీ) సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ […]

Published By: HashtagU Telugu Desk
IT Minister Nara Lokesh Receives Grand Welcome At Singapore

IT Minister Nara Lokesh Receives Grand Welcome At Singapore

ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్‌లోని ప్రఖ్యాత పుంగోల్ జిల్లా తరహాలో ఒక భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఈ టౌన్‌షిప్ కేవలం రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికే ఒక మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్‌సీ) సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. సింగపూర్ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తిగల భాగస్వాములను ఆహ్వానిస్తూ ఆర్‌ఎఫ్‌పీ (ప్రతిపాదనల కోసం అభ్యర్థన) జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజధాని అమరావతికి ఇప్పుడు పూర్తిస్థాయి చట్టబద్ధత ఉందని, ఇది పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అవసరమైన మద్దతు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్లోబల్ హబ్‌గా ఏపీ.. సింగపూర్ సహకారంతో ముందడుగు
అమరావతి నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు పలు ప్రతిపాదనలను లోకేశ్‌ సింగపూర్ ప్రతినిధుల ముందుంచారు. సింగపూర్‌లోని సన్‌టెక్ సిటీ తరహాలో ఏపీని కూడా ఒక గ్లోబల్ మైస్ (MICE – మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) గమ్యస్థానంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. దీనికోసం సన్‌టెక్ సిటీని అధ్యయనం చేస్తామని తెలిపారు. అలాగే, ఏపీ నుంచి సింగపూర్ మీదుగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని సులభతరం చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.

రాష్ట్రంలో పాలనను మరింత పటిష్ఠం చేసేందుకు సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకుంటామని లోకేశ్ తెలిపారు. ముఖ్యంగా రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్‌టీజీఎస్‌) వ్యవస్థను బలోపేతం చేయడంలో సింగపూర్ సహకారం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు పూర్తి సానుకూల వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పటిష్ఠంగా భాగస్వామ్యం.. కొనసాగుతున్న శిక్షణ
గతేడాది నవంబర్‌లో ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) పురోగతిని సమీక్షించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్‌సీ), జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీ (జేఐడ‌బ్ల్యూసీ)లను ఏర్పాటు చేశారు. ఇరు ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యం పటిష్ఠంగా ఉందని, ఏపీకి చెందిన ఆరుగురు మంత్రులు, 37 మంది ఉపాధ్యాయులు సింగపూర్‌లో శిక్షణ పొందారని లోకేశ్‌ ప్రస్తావించారు. వారి అనుభవాలను రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలు చేస్తామని చెప్పారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి గాన్ సియో హువాంగ్, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారులు దత్తి సురేంద్ర, అనంత శంకర్, పీయూష్ కుమార్, కాటంనేని భాస్కర్, సింగపూర్ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  Last Updated: 11 May 2026, 11:27 AM IST