Immediately Have Babies: కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. జనాభా ప్రాతిపదికన దేశంలోని లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్న వేళ కుటుంబ నియంత్రణ పాటించమని ప్రజలకు తాను చెప్పలేనన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తమిళ ప్రజలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఇప్పటిదాకా మేం కుటుంబ నియంత్రణపై ఫోకస్ చేశాం. ఇక నుంచి జనాభా పెంచుకోవడంపై ఫోకస్ చేస్తాం. జనాభా తక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గాలను తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం ఆలోచనే అన్యాయమైంది’’ అని స్టాలిన్ మండిపడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి సమాధానాన్ని జనాభాతో ఇద్దాం. కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి’’ అని తమిళనాడు సీఎం(Immediately Have Babies) ప్రజలకు సూచించారు. నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :A Prostitute Story : ఆస్కార్‌లో ‘పంచ్’ విసిరిన వేశ్య కథ.. ‘అనోరా’ స్టోరీ ఇదీ
5న అఖిలపక్ష సమావేశం
జనాభా ప్రాతిపదికన దేశంలోని లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజన చేసేందుకు కేంద్రం చేస్తున్న యోచనపై చర్చించేందుకు ఈనెల 5న సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనాలంటూ తమిళనాడులోని 40కిపైగా పార్టీలకు ఆయన ఆహ్వానం పంపారు. 2026లో జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రతీ రాష్ట్రానికి 8 నియోజకవర్గాలు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు.
Also Read :Galwan Clash: భారత సైనికుల దెబ్బతో కోమాలోకి.. ఆ చైనీయుడికి వరుస సత్కారాలు
పునర్విభజన ట్రాక్ రికార్డ్
- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు పెద్ద చరిత్రే ఉంది.
- తొలిసారిగా 1951లో మన దేశంలో 494 లోక్‌సభ సీట్లు ఉండేవి. అప్పట్లో ఒక్కో సీటుకు 7.3 లక్షల జనాభా ఉండేది.
- 1961లో మన దేశంలో 522 లోక్‌సభ సీట్లు ఉండేవి. అప్పట్లో ఒక్కో సీటుకు 8.4 లక్షల జనాభా ఉండేది.
- 1971లో మన దేశంలో 543 లోక్‌సభ సీట్లు ఉండేవి. అప్పట్లో ఒక్కో సీటుకు 10.1 లక్షల జనాభా ఉండేది.
- కుటుంబ నియంత్రణ ప్రచార ఉద్యమం 1976 నాటికి మన దేశంలో పతాక స్థాయిలో ఉంది. దీంతో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 25 ఏళ్ల పాటు వాయిదా వేశారు.
- 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 1976 నుంచి 2000 సంవత్సరం వరకు ఫ్రీజ్ చేశారు.
- 2001లో 84వ రాజ్యాంగ సవరణ చేశారు. దీని ద్వారా మరో 25 ఏళ్ల పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఫ్రీజ్ చేశారు. ఈ తేదీ 2026లో ముగుస్తుంది.