జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

ఈ 33 ప్రశ్నల్లో ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్’కు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న జంటల సంబంధం ఎలాంటిది? అని అడుగుతారు.

Published By: HashtagU Telugu Desk
Census

Census

Census 2026: ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా జనాభా గణన ప్రారంభం కానుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇది 16వ జనాభా గణన కాగా.. తొలిసారిగా డిజిటల్ జనాభా గణన జరగబోతోంది. అలాగే మొదటిసారిగా కులాధారిత జనాభా గణన కూడా నిర్వహించనున్నారు. అంటే ఈసారి జనాభా గణనలో కులం కోసం ప్రత్యేక కాలమ్ ఉంటుంది. మరో విశేషమేమిటంటే.. దేశప్రజలు అధికారిక పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో కూడిన జాబితాను సిద్ధం చేసింది.

ప్రతి భారతీయుడి సమగ్ర సమాచారం

ఈ 16వ జనాభా గణనలో కేవలం పురుషులు, మహిళలు, పిల్లల సంఖ్య మాత్రమే కాకుండా.. భారతీయుల జనన మరణాలు, జీవనశైలి, సంబంధ బాంధవ్యాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, ఇల్లు, ఆఫీసు, రేషన్, నీరు, కార్లు, బైకులు, సైకిళ్ల వరకు ప్రతి ఒక్క అంశాన్ని సేకరిస్తారు. ఇది కేవలం గణాంకాల కోసమే కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, సౌకర్యాల కల్పనకు ఆధారం కానుంది.

Also Read: బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

కేంద్రం సిద్ధం చేసిన 33 ప్రశ్నల ప్రశ్నావళి

మొదటి దశ జనాభా గణన కోసం ప్రభుత్వం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించింది. జనాభా గణన అధికారులు ఇంటింటికీ వచ్చి ఈ ప్రశ్నలు అడుగుతారు. అలాగే ప్రజలు ఆన్‌లైన్‌లో కూడా వీటికి సమాధానాలు ఇవ్వవచ్చు. దీని కోసం ప్రభుత్వం పోర్టల్‌లో ‘సెల్ఫ్-ఎన్యూమరేషన్’ అనే ఆప్షన్ ఇచ్చింది. ‘హౌస్‌లిస్టింగ్’, ‘జనాభా లెక్కింపు’ అనే రెండు దశల్లోనూ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై ప్రశ్నలు

ఈ 33 ప్రశ్నల్లో ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్’కు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న జంటల సంబంధం ఎలాంటిది? అని అడుగుతారు. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండాలనుకునే వారి బంధాన్ని ‘స్థిరమైన సంబంధం’గా పరిగణించి, వారిని వివాహిత జంటగా గుర్తిస్తారు.

ఇంటి నంబర్‌తో గణన ప్రారంభం

మున్సిపాలిటీ కేటాయించిన ఇంటి నంబర్ల ఆధారంగా ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇంటి వినియోగం, కుటుంబ సభ్యులు, వారి ఉద్యోగాలు, జీవనోపాధి మార్గాలు, వాహనాల సంఖ్య, పిల్లలు, వృద్ధులు, పేరు, లింగం, కులం, విద్య, ఆస్తి హక్కులు వంటి ప్రశ్నలు అడుగుతారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తప్పనిసరి.

ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’

రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనాభా గణనలో సేకరించిన వ్యక్తిగత వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చు. దీని కోసం 11 అంకెల ఐడీ క్రియేట్ చేసుకోవాలి. దానిని ఇంటికి వచ్చే అధికారికి చెప్పాల్సి ఉంటుంది. పాఠశాల ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, నోడల్ అధికారులు, తహసీల్దార్లు, SDMలు ఈ గణనను నిర్వహిస్తారు. జనాభా గణన మొబైల్ యాప్ 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది.

జనాభా గణనలో అడిగే కొన్ని నమూనా ప్రశ్నలు

  1. ఇంటి నిర్మాణం ఎలా ఉంది? గోడలు, పైకప్పు తయారీకి ఏ పదార్థాలను వాడారు?
  2. కుటుంబ యజమాని ఎవరు? వారి పేరు, లింగం, కులం ఏమిటి? కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎవరు ఏం చేస్తారు?
  3. ఇంట్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఎలా ఉంది? ఎన్ని వాహనాలు ఉన్నాయి?
  4. ఇంట్లో ఎంతమంది వివాహిత జంటలు ఉన్నారు? పిల్లలు, వృద్ధులు ఎంతమంది? ఎవరైనా లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నారా?
  Last Updated: 30 Mar 2026, 05:59 PM IST