Alcohol Addiction : భర్తలు బాగా తాగొచ్చి భార్యలతో గొడవకు దిగే ఘటనలు చాలానే జరుగుతుంటాయి. అయితే ఆ ఊరిలో అంతా వెరైటీగా జరుగుతోంది. మహిళలే తప్ప తాగుతున్నారు. భర్తలు కష్టపడి సంపాదించి తెచ్చే డబ్బునంతా తాగుడుకు ఖర్చు పెడుతున్నారు. భార్యలు తాగుడు ఊబిలో కూరుకుపోతుండటాన్ని చూసి ఆ భర్తలు తట్టుకోలేకపోయారు. నేరుగా పోలీసు స్టేషనులో కంప్లయింట్ ఇచ్చారు.
Also Read :Crypto Kingpin : రూ.8 లక్షల కోట్ల స్కాం.. అమెరికా వాంటెడ్.. కేరళలో దొరికాడు
కొండగూడ గ్రామంలో..
ఈ ఘటన ఒడిశాలోని కోరాపుత్ జిల్లా కొండగూడ గ్రామంలో చోటుచేసుకుంది. మద్యానికి బానిస అవుతున్న తమ భార్యలను కాపాడాలంటూ పలువురు వ్యక్తులు పోలీసులను వేడుకున్నారు. ఆబ్కారీ శాఖ అధికారులకు కూడా దీనిపై సమాచారాన్ని అందించారు. కొండగూడలో తయారు చేస్తున్న నాటుసారాకు(Alcohol Addiction) తమ భార్యలు బానిసలుగా మారారని చెప్పారు. స్థానికంగా నాటుసారాను తయారు చేసి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు, ఆబ్కారీ అధికారులను సదరు వ్యక్తులు కోరారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారికి అధికారులు హామీ ఇచ్చారు.
ఈ రాష్ట్రాల మహిళలు టాప్
- ప్రపంచంలో మద్యం వినియోగంలో భారతదేశం స్థానం 3. తొలి రెండు స్థానాల్లో చైనా, రష్యా ఉన్నాయి.
- అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల్లో 26 శాతం మంది మద్యం తాగుతారు. సిక్కింలోని 16.2 శాతం మంది, అసోంలోని 7.3 శాతం మంది మహిళలు మద్యం తాగుతారు.
- తెలంగాణలోని 6.7 శాతం మంది మహిళలు మద్యం తాగుతారు.
- జార్ఖండ్‌లోని 6.1 శాతం మంది మహిళలు, అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్‌లలోని 5 శాతం మంది మహిళలు మద్యం తాగుతారు.
- ప్రస్తుతం బిహార్, గుజరాత్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అమలులో ఉంది.
- మద్యపాన నిషేధం లేని రాష్ట్రాలకు 2 లీటర్ల వరకు లిక్కర్‌ను ఎవరైనా తీసుకెళ్లొచ్చు. ఇంతకు మించి తీసుకెళ్తే రూ.5000 జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.