Operation Bhediya : తోడేళ్ల గుంపు దడ పుట్టించింది. గత రెండు నెలల టైంలో ఉత్తరప్రదేశ్‌లోని భరాఛ్ జిల్లాలో 8 మందిని బలితీసుకుంది. చనిపోయిన వారిలో ఆరుగురు పిల్లలు, ఓ మహిళ కూడా ఉన్నారు. భరాఛ్ జిల్లాలోని మెహాసి తెహ్‌సిల్ గ్రామం చుట్టుపక్కల ఊళ్లకు చెందిన దాదాపు 30 మంది ఈ తోడేళ్ల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతాలను సీరియస్‌గా తీసుకొని జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన ‘ఆపరేషన్ భేడియా’(Operation Bhediya) సక్సెస్ అయింది.
We’re now on WhatsApp. Click to Join
ప్రజలకు దడ పుట్టిస్తూ అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన తోడేళ్ల గుంపును పట్టేందుకు అటవీశాఖ అధికారులు డ్రోన్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను వాడారు. వాటితో తోడేళ్లు సంచరించే ప్రాంతాలపై స్పష్టమైన నిఘా పెట్టారు. ఈక్రమంలో ఒకరోజు రాత్రి రెండు తోడేళ్లు సంచరిస్తున్న ఏరియాను గుర్తించారు. వాటిని వ్యూహాత్మకంగా చుట్టుముట్టి పట్టుకున్నారు. తదుపరిగా మరో రెండు తోడేళ్లను కూడా చాకచక్యంగా బంధించారు. అయితే వీటిని పట్టుకునే ముందు.. ఏనుగు మల మూత్రాలను తోడేళ్లు సంచరించే ప్రాంతాల్లో వెదజల్లించారు. ఈ వాసనను గమనించిన తోడేళ్లు ఆయా ప్రాంతాలకు వెళ్లడం మానేశాయి.
Also Read :Bharat Dojo Yatra : త్వరలో ‘భారత్ డోజో యాత్ర’.. వీడియో షేర్ చేసిన రాహుల్‌గాంధీ
అనంతరం తోడేళ్లకు మత్తు మందు ఇవ్వడానికి చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ నుంచి అనుమతులను తీసుకున్నారు. డ్రోన్లు, థర్మల్, ఇన్ఫ్రారెడ్ కెమెరాల సాయంతో తోడేళ్లు ఉండే ఏరియాలను కచ్చితత్వంతో గుర్తించారు. అవి ఎక్కువగా తిరుగుతున్న ఏరియాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ భేడియాను నిర్వహించేందుకు 12 మంది జిల్లాస్థాయి అధికారుల సారథ్యంలో 16 బృందాలను రంగంలోకి దింపారు. ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రేణుసింగ్ స్వయంగా వచ్చి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. మరో నాలుగు తోడేళ్లను పట్టుకోవాల్సి ఉందని తెలుస్తోంది. చివరి తోడేలును పట్టుకొనే దాకా ఆపరేషన్ భేడియాను కొనసాగిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం కులాయ్‌లా అనే గ్రామం వద్ద నాలుగో తోడేలును బోనులో బంధించామని వెల్లడించారు.