Waqf Act : వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 73 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ(బుధవారం) విచారణ జరిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వీటిని విచారించింది. కేంద్ర ప్రభుత్వం కేవియెట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇరుపక్షాల వాదనలు వింటూ తొలిరోజు విచారణ ముందుకు సాగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సీజేఐ సంజీవ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సుదీర్ఘకాలంగా ముస్లింల కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం. అలా చేయడం దుర్వినియోగం కిందికి వస్తుంది. వాస్తవికంగా ముస్లిం సంబంధిత ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న వక్ఫ్ ఆస్తులు కూడా చాలానే ఉన్నాయి. హిందువుల ధార్మిక ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారేంటి ? చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీల్లేదు’’ అని ఆయన కామెంట్ చేశారు.
Also Read :Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సభర్వాల్కు పోలీసుల నోటీసులు.. ఎందుకు ?
కేంద్రానికి సుప్రీం ప్రశ్నలు ఇవీ..
- వక్ఫ్ సవరణ చట్టం(Waqf Act)లో కేంద్ర సర్కారు చేసిన సవరణలపై సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని ప్రశ్నలను సంధించింది. వినియోగం ఆధారంగా వక్ఫ్ ఆస్తిగా పరిగణించే నిబంధన తొలగించడాన్ని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది.
- కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనను కూడా కోర్టు ఎత్తి చూపింది. ముస్లింలను హిందూ ఎండోమెంట్ బోర్డులలో భాగం కావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా అని సుప్రీంకోర్టు ఈసందర్భంగా కేంద్ర సర్కారును ప్రశ్నించడం గమనార్హం.
- ‘‘వందల ఏళ్లనాటి ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి ? వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం బాధాకరం’’ అని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.
- పిటిషనర్ల అభ్యర్థన మేరకు .. వక్ప్ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది.
- కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని ఆదేశించింది.
Also Read :Robert Vadra : పాలిటిక్స్‌లోకి రాబర్ట్ వాద్రా.. గ్రౌండ్ రెడీ ?
కలెక్టరే జడ్జి పాత్ర పోషించడం రాజ్యాంగ విరుద్ధం : కపిల్ సిబల్
పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘‘వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక నిబంధనలు మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయి. కొత్త చట్టంలో వక్ఫ్ వ్యవహారాల్లో కలెక్టర్‌కు అదనపు అధికారాలు ఇచ్చారు. కలెక్టర్ ప్రభుత్వంలో ఒక భాగం. ఆయనే న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధం’’ అని సిబల్ వాదించారు.అనంతరం సుప్రీంకోర్టు విచారణను రేపటికి (గురువారం) వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణ చేపట్టనుంది.ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి వచ్చింది.
కేంద్రం వివరణ తీసుకునేందుకు సమయం ఇవ్వండి : సొలిసిటర్ జనరల్
కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం వివరణ తీసుకునేందుకు సమయం కోరారు. సుప్రీంకోర్టు అడిగిన మరికొన్ని ప్రశ్నలపైనా కేంద్ర సర్కారు వివరణ తీసుకుని జవాబు ఇస్తానని చెప్పారు.