Onions On Fire : ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉల్లి కొనేందుకు దిగువ మధ్యతరగతి, నిరుపేద వర్గాల ప్రజలు జంకుతున్నారు. కారణం ఏమిటంటే.. అక్కడ కేజీ ఉల్లి ధర రూ.100 దాకా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు ఉల్లి సప్లై ప్రధానంగా మహారాష్ట్ర నుంచే జరుగుతుంటుంది. మన దేశంలో అత్యధికంగా ఉల్లి పంట సాగయ్యే రాష్ట్రం కూడా మహారాష్ట్రే. అందుకే ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఉల్లి కోసం మహారాష్ట్రపై ఆధారపడుతుంటాయి. ఈ రాష్ట్రంలో ఏ ప్రతికూల అంశాలు చోటుచేసుకున్నా.. యావత్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉల్లి ధరలు మండిపోతాయి. ఈక్రమంలోనే మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్టు వల్లే ఉల్లి ధరలు(Onions On Fire) ప్రస్తుతం కొండెక్కాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Also Read : Paytm UPI : గుడ్ న్యూస్.. మరో 6 దేశాల్లోనూ పేటీఎం యూపీఐ సేవలు
మహారాష్ట్ర నుంచి విదేశాలకు కూడా ఉల్లి ఎగుమతి అవుతుంటుంది. సాధారణంగానైతే మనదేశంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు.. విదేశాలకు వాటి ఎగుమతిపై కేంద్ర సర్కారు పరిమితులు విధిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకోలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఇప్పుడు కేంద్ర సర్కారు సాహసించి మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లి ఎగుమతిపై పరిమితులు విధిస్తే.. ఉల్లి రైతులు ఆగ్రహానికి గురవుతారు. ఆ ప్రభావం ఎన్నికల్లో నేరుగా బీజేపీపై పడుతుంది.
Also Read :GO 16 : జీవో 16ను కొట్టేసిన హైకోర్టు.. జాబ్స్ రెగ్యులరైజ్ అయిన వేలాది మందికి టెన్షన్
మహారాష్ట్రలో ఉల్లి పంట అత్యధికంగా సాగయ్యే 12 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి.. దిండోరి, నాసిక్, షిర్డీ, అహ్మద్‌నగర్, ధులే, నందూర్‌బర్, జల్గావ్, షిరూర్, బారామతి, మావల్, పుణె. వీటన్నింటిని కలిపి ‘ఆనియన్ బెల్ట్’ అని పిలుస్తుంటారు. ఆయాచోట్ల సానుకూల ఎన్నికల ఫలితాలను సాధించే యత్నంలో ఉన్న బీజేపీ .. అక్కడి ఉల్లి రైతుల ఆగ్రహాన్ని చవిచూడాలని అస్సలు కోరుకోదు. అందుకే విదేశాలకు ఉల్లి ఎగుమతిపై పరిమితులు విధించడం లేదు. బహుశా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాతే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.