Caste Census : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కులగణన జరగబోతోంది. ఇందుకు కేంద్రంలోని మోడీ సర్కారు బుధవారం మధ్యాహ్నం పచ్చజెండా ఊపింది. కులగణనతో ముడిపడిన చారిత్రక, సామాజిక అంశాల గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :BJP Big Plan: గోదావరి జిల్లాలపై బీజేపీ గురి.. ఇద్దరు ఎంపీలతో బిగ్ స్కెచ్
కులగణన అంటే ఏమిటి ?
మనదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని సామాజిక వర్గాల్లోనూ కులాలు ఉన్నాయి. ఆయా వర్గాల వారు సదరు కులాల పేరుతో క్యాస్ట్ సర్టిఫికెట్లు పొందుతుంటారు. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ? వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి ? విద్యాపరంగా వారి పరిస్థితి ఎలా ఉంది ? అనే వివరాలను దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో భాగంగా సేకరించనున్నారు. ప్రభుత్వ ఉపాధి, సంక్షేమ పథకాల అందుబాటు వంటి అంశాల్లో వివిధ కులాల వాటాపై క్లారిటీకి రావడానికి కులగణన దోహదం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ సమాచారం ప్రామాణికంగా మారుతుంది. దీని ఆధారంగానే ఆయా వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి ఏటా బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తారు. ప్రభుత్వ ప్రణాళికలు కూడా ఈ కులాల కూర్పుకు అనుగుణంగానే ఉండనుంది.
గతంలోనూ కులగణనలు..
బ్రిటీషర్ల పాలనా కాలంలోనే మన దేశంలో కులగణన(Caste Census) నిర్వహించారు. 1881 నుంచి 1931 సంవత్సరం వరకు మనదేశంలో బ్రిటీషర్లు కులగణన చేయించారు. 1931కి ముందు నిర్వహించిన ప్రతి జనాభా గణనలో అన్ని కులాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కులగణన ఆగిపోయింది.తొలిసారిగా 1951లో మనదేశంలో జనగణన చేయగా.. అందులో కుల గణనను చేర్చలేదు. అయితే 1961లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనాభా లెక్కల్లో రాష్ట్రాలు సొంతంగా ఓబీసీల లెక్కలను చేర్చుకోవచ్చని సూచించింది.
ఇతర కులాల సమాచారం లేకుండానే..
1951 నుంచి 2011 వరకు భారతదేశంలోని ప్రతి జనాభా గణన షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) డేటాను సేకరించి ప్రచురించింది. కానీ ఇతర కుల సమూహాల డేటాను సేకరించలేదు. భారత ప్రభుత్వం పౌరులను సామాజిక, విద్యా ప్రమాణాల ఆధారంగా నాలుగు విస్తృత సమూహాలుగా వర్గీకరించింది. అవి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ. 1971 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా మన దేశ మొత్తం జనాభాలో 21.54 శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 25.26 శాతానికి పెరిగింది.2011లో నాటి యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల గణన (SECC)ను నిర్వహించింది. అయితే పలు కారణాల వల్ల ఆ సర్వే వివరాలను అధికారికంగా విడుదల చేయలేదు. ఎట్టకేలకు 60 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కులగణన చేయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే జనాభా గణనలో భాగంగా కుల గణనను కూడా చేపడతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.
ఎన్డీయే ప్రభుత్వం నో చెప్పడంతో ఈ రాష్ట్రాల్లో..
ఎన్డీయే ప్రభుత్వం కుల గణనను తిరస్కరిస్తూ వస్తుండటంతో.. తొలిసారిగా బిహార్‌లో కులగణన నిర్వహించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో కుల గణన జరిగింది. 2023లో బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో ఓబీసీలు, ఈబీసీలు 63శాతం మంది ఉన్నట్లు తేలింది. 2024లో ఆంధ్రప్రదేశ్ కుల గణనను చేపట్టింది. 2024 నవంబరులో తెలంగాణలో కుల గణన జరిగింది. 2021లో కుల గణన చేపట్టాలని జార్ఖండ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఒడిశా, మహారాష్ట్రల్లోనూ కుల గణనపై తీర్మానాలు జరిగాయి.