భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan) మరోసారి దుస్సాహసానికి దిగింది. ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం (Indian Army) ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్ర మూలాలను ధ్వంసం చేస్తుండటాన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్, శుక్రవారం తెల్లవారుజామున సరిహద్దుల్లో క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో దాడులకు తెగబడింది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సైనిక స్థావరాలపై టార్గెట్ చేసుకుని పాక్ కుట్రలు పన్నింది. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉండటంతో ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది.
S-400 Missile System : భారత వాయుసేనలో పవర్ఫుల్ ఆయుధం ఇదే !
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (US Vice President J.D. Vance)స్పందించారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల్లో (India – Pakistan war) తాము జోక్యం చేసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఇదొక ద్వైపాక్షిక అంశమని పేర్కొంటూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఉద్రిక్తతలు తగ్గించేందుకు మాత్రమే ప్రయత్నిస్తామన్నారు. అయితే తన భారత పర్యటన సందర్భంగా పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరగడంతో, భారతదేశంపై జరుగుతున్న ఉగ్రకార్యకలాపాల తీవ్రతను వాంస్ దగ్గరగా చూసే అవకాశం లభించింది.
ఇకపోతే శుక్రవారం ఉదయం ఉరి సెక్టార్ ప్రాంతంలో పాక్ దాడి జరిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని చేసే దాడులు పాకిస్థాన్ ఉగ్ర మద్దతును మరింత బహిర్గతం చేస్తున్నాయి. భారత వాయుసేన, భూ సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, అన్ని వైమానిక మరియు భూస్థాయి దాడులకు కౌంటర్ చర్యలు చేపడుతోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తమ వైమానిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెపుతోంది.