Pakistan Attack : మే 7న భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలం అయింది. బుధవారం అర్ధరాత్రి డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్‌పై దాడికి యత్నించింది. భారత్‌లోని అవంతిపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, బఠిండా, చంఢీగఢ్, నల్, ఫలౌడి, ఉత్తర్‌లయ్, బుచ్ ప్రాంతాలపై ఎటాక్ చేసేందుకు యత్నించింది. ఈవివరాలను భారత ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషి ఇవాళ (గురువారం) మీడియాకు వెల్లడించారు. ‘‘బుధవారం అర్ధరాత్రి నుంచి కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంఛ్, మెందార్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది’’ అని ఆమె చెప్పారు. ఈసందర్భంగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, భారత వాయుసేన ప్రతినిధి వ్యోమికా సింగ్ కూడా పలు వివరాలను మీడియా ముందుంచారు.
Also Read :India Attack : పాక్ రక్షణ వలయం ధ్వంసం.. భారత్ ‘హార్పీ’ ఫీచర్లు ఇవీ
పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు మేం స్పందిస్తున్నాం.. అంతే : విక్రమ్ మిస్రీ
‘‘ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తానే. ఆ దేశానికి చెందిన ఉగ్రవాదులే ఈ ఉగ్ర దాడిలో భాగమయ్యారు. దానికి ప్రతిక్రియగానే భారత్ స్పందిస్తోంది. బుధవారం అర్ధరాత్రి కూడా భారత్‌పై దాడికి పాకిస్తాన్ యత్నించింది. మేం స్పందించాం. భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థ ఎదుట పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లు నిలువలేకపోయాయి. ప్రతిగా మేం నిర్వహించిన ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోనూ నష్టం సంభవించింది ’’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Pakistan Attack) వెల్లడించారు.
Also Read :KA Paul : ప్రధాని మోడీని కలిశాక పాక్‌కు వెళ్తా.. కేఏ పాల్ కీలక ప్రకటన
పాక్ కాల్పుల వల్లే 16 మంది చనిపోయారు
‘‘ఎల్‌ఓసీ వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఏప్రిల్ 22 నుంచి కంటిన్యూ అవుతున్నాయి. మోర్టార్లు, భారీ ఆయుధాలతో సరిహద్దు గ్రామాలపైకి పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. ఈ దాడుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన 16 మంది ప్రజలు చనిపోయారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు’’ అని విక్రమ్ మిస్రీ తెలిపారు.