Jairam Ramesh : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్‌ఖడ్ తీసుకున్న నిర్ణయం వెనుక లోతైన కారణాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
జైరాం రమేష్ మాట్లాడుతూ, “ధన్‌ఖడ్ నిర్ణయం ఒక సాధారణ అంశం కాదు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్యలో ఏదో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. దాని తరువాతే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు” అని తెలిపారు.
ధన్‌ఖడ్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో కొన్ని విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ మీటింగ్‌కు హాజరుకాలేదు.
AP News : ఏపీ రైతులకు శుభవార్త.. తోతాపురి మామిడి కొనుగోలుపై చారిత్రక ఆమోదం.!
“బీఏసీ సమావేశానికి నడ్డా, రిజిజు రాకపోవడంపై ధన్‌ఖడ్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇది ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఆయనను తీవ్రంగా కలచివేసింది” అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.
ధన్‌ఖడ్ ఎల్లప్పుడూ రాజ్యసభ నిబంధనలు, పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో కఠినమైన వైఖరిని అనుసరించారని కాంగ్రెస్ నేత అన్నారు. “తన పదవిని ఉపయోగించి ఎప్పుడూ హౌస్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఇటీవల పరిణామాలు ఆయనను తీవ్రంగా నిరాశపరిచాయి” అని జైరాం రమేష్ తెలిపారు.
ధన్‌ఖడ్ రాజీనామా వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఏసీ మీటింగ్‌లో హాజరుకాని కీలక నేతల గైర్హాజరు, మరియు ఇటీవల రాజ్యసభలో జరిగిన వివిధ వివాదాస్పద అంశాలు ఆయన నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
జైరాం రమేష్ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. ధన్‌ఖడ్ తాను ఎందుకు రాజీనామా చేశారో త్వరలో స్పష్టత ఇవ్వవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.