Maha Kumbh Revenue : ఇవాళ ప్రారంభమైన మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించనుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక మేళా ద్వారా యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు దాదాపు రూ.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందట. మహా కుంభమేళా నిర్వహణ కోసం యూపీ సర్కారు రూ.7 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అంటే రూ.7వేల కోట్ల ఖర్చుతో ఏకంగా రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్ని యోగి సర్కారు సంపాదించబోతోందన్న మాట.
Also Read :Z Morh Tunnel : ‘జెడ్ -మోర్హ్’ సొరంగానికి మోడీ శ్రీకారం.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
తొలిరోజు సర్కారు ఖజానాకు రూ.25వేల కోట్లు
ఇవాళ మేళాలో తొలిరోజున దాదాపు రూ.25వేల కోట్ల ఆదాయం యూపీ సర్కారు ఖజానాలోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఏ లెక్కన చూసుకున్నా.. ఈ అంచనాలు నిజమవడం ఖాయమే. ఎందుకంటే ఇవాళ ఉదయం 5 గంటల నుంచి 9.30 గంటల మధ్య ప్రయాగ్ రాజ్(Maha Kumbh Revenue) నగరంలోని గంగా,యమున,సరస్వతీ నదుల త్రివేణీ సంగమంలో ఏకంగా 60 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. రాత్రి వరకు ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో మనం అంచనా వేసుకోవచ్చు. ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 35 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాల కోసం ప్రయాగ్ రాజ్‌కు వస్తారట. వారంతా వసతి కోసం, పూజా సామగ్రి కోసం, పూల కొనుగోలుకు, భోజనాల కోసం డబ్బులు ఖర్చు చేయనున్నారు. వాటి ద్వారా యూపీ సర్కారుకు, స్థానిక వ్యాపారులకు మంచి ఆదాయం లభిస్తుంది.
ఏ వ్యాపారం ఎంత జరుగుతుంది ?
- ఈసారి మహాకుంభ మేళాలో పూజా సామగ్రికి సంబంధించిన రూ.5వేల కోట్ల వ్యాపారం, పాల ఉత్పత్తులకు సంబంధించిన రూ.4వేల కోట్ల వ్యాపారం జరగొచ్చు.
- రూ.800 కోట్ల పూల వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్లకు సంబంధించి రూ.6వేల కోట్ల వ్యాపారం జరగొచ్చు.
- యూపీ ప్రభుత్వం మహాకుంభ మేళా కోసం 1.6 లక్షల టెంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 2,200 లగ్జరీ టెంట్లు ఉన్నాయి.
- లగ్జరీ టెంట్లలో ఒక రాత్రి ఉండటానికి రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. 44 సూపర్ లగ్జరీ టెంట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. వాటిలో ఖాళీలు లేవు.
- యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెంట్లలో మామూలు వాటిలో ఒక రాత్రి ఉండాలంటే రూ.1500 దాకా చెల్లించాలి.
- ప్రభుత్వానికి చెందిన లగ్జరీ టెంట్లలో ఉండాలంటే రూ.10వేల నుంచి రూ.35వేల దాకా కట్టాలి.
- ప్రయాగ్ రాజ్ నగరంలో 218 హోటళ్లు, 204 గెస్ట్ హౌస్‌లు, 90 ధర్మశాలలు ఉన్నాయి.
- ప్రయాగ్ రాజ్‌లో పర్యాటకులు, యాత్రికుల సౌకర్యార్ధం 1000 మంది గైడ్లను కూడా యూపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.