Zakir Naik : వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జాకిర్ నాయక్ ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. తాజాగా పాకిస్తాన్‌లోని ఓ అనాథ శరణాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రసంగం అనంతరం చివర్లో జాకిర్ నాయక్‌కు మెమెంటోను అందజేసేందుకు వేదికపై ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో సదరు అనాథ శరణాలయం నిర్వాహకుడితో పాటు కొందరు అనాథ బాలికలు వేదికపైకి వచ్చారు. ఆ బాలికలను అనాథ శరణాలయం నిర్వాహకుడు చూపిస్తూ.. వారు తన బిడ్డలని జాకిర్ నాయక్‌తో చెప్పారు. వాస్తవానికి ఈ పదాన్ని వాడటంలో అనాథ శరణాలయం నిర్వాహకుడికి ఎలాంటి దురుద్దేశం లేదు. పిల్లలను ‘బిడ్డలు’ అని పెద్ద వయస్కులు పిలవడం పెద్ద తప్పు కూడా కాదు. అనాథ పిల్లల్ని తన బిడ్డల్లా చూసుకుంటున్నాననే కోణంలోనే అనాథ శరణాలయం నిర్వాహకుడు ‘బిడ్డలు’ అనే పదాన్ని వాడాడు. అయితే దీనిపై జాకిర్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కోపంతో స్టేజీ దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘‘ఆ అనాథ బాలికలకు పెళ్లీడు వచ్చింది. అందుకే వారిని అనాథ శరణాలయం నిర్వాహకులు కూతుళ్లు అని పిలవకూడదు. వారిని కనీసం తాకకూడదు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం.. పెళ్లీడుకు వచ్చిన అనాథ బాలికలు అనాథ శరణాలయం నిర్వాహకులకు ‘నాన్ -మహ్రం’’ అని జాకిర్ నాయక్ (Zakir Naik) చెప్పారు.
Also Read :Iran Vs US : ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. బైడెన్, ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న జాకిర్ నాయక్ ఇక్కడి నుంచి తొలుత సౌదీ అరేబియాకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి మలేషియాకు చేరుకున్నారు. 20 రోజుల పర్యటన కోసం ఇటీవలే ఆయన మలేషియా నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్నారు. ఆయనకు చెందిన పీస్ టీవీని భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో బ్యాన్ చేశారు. జాకిర్ నాయక్‌కు ప్రవేశం ఇచ్చేది లేదని కెనడా, యూకే తేల్చి చెప్పాయి.