BJP: దటీజ్ బిజెపి టైమింగ్

ఇండియా (INDIA) అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. దాన్ని బిజెపి (BJP) వారు మరోరకంగా అర్థం చేసుకున్నారు.

  • Written By:
  • Updated On - September 8, 2023 / 10:10 AM IST

By: డా. ప్రసాదమూర్తి

BJP: ఇండియా (INDIA) అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. దాన్ని బిజెపి (BJP) వారు మరోరకంగా అర్థం చేసుకున్నారు. యూనిటీ అంతా తమ డైవర్సిటీ పాలిటిక్స్ లోనే ఉందని వారు గ్రహించిన తత్వ సారం బిజెపి రాజకీయ గీతాసారంగా భావించాలి. ‌ కీలెరిగి వాత పెట్టాలి అన్న సామెత అర్థం బిజెపికి తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదని చెప్పాలి. ఏ సమయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అది అధికార బిజెపి అనుసరించే వ్యూహంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందుకే బిజెపి టైమింగ్ కి ఎవరైనా సెల్యూట్ చెప్పాల్సిందే.

రెండు మూడు ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ, ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహం. ఏముందిలే చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లాచెదురై ఉన్న ఈ పార్టీలు కలిసేదెప్పుడు, కలిసినా కలిసి నడిచేదెప్పుడు, నడిచినా ఆ నడక ఒక తీరుగా సాగేదెప్పుడు, సాగినా అది గమ్యం చేరేదెప్పుడు.. ఇలాంటి ఊహాపోహలలో బిజెపి మొదట కొట్టుకుపోయింది. కానీ ఆ వెంటనే తేరుకొని కళ్ళు తెరిచి ఇక లాభం లేదనుకొని ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేయడం మొదలుపెట్టింది. అదిగో ఆ సందర్భంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు అంటూ ఒక బాంబు పేల్చింది.

మణిపూర్ మారణకాండ , నూహ్ లాంటి ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు, నిరుద్యోగం, అధిక ధరలు, అదానీ కార్పొరేట్ డొల్ల కంపెనీల కహానీ వ్యవహారం.. ఇలా రకరకాల సమస్యలతో ప్రజల ముందుకు వెళ్దామని ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్న సమయంలో, ఒక్కసారి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల మాట వినగానే అందరూ ఆ సమావేశాలు దేనికి? ఎందుకు ప్రతిపక్షలతో సంప్రదించకుండా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు? దేనికి ఇలా చేస్తున్నారు? ఇది రాజ్యాంగబద్ధమా ఇట్లాంటి ఆలోచనల వైపు ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి.

Also Read: Telangana : జీతాలు అందడంలేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డు మృతి

అలా వాళ్ళు కొట్టుకుపోతున్న దశలో ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అంటూ మరో బాంబు పేల్చింది బిజెపి. ఇక చర్చ మొత్తం దీని మీదకు మళ్ళింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలతో సహా అందరూ ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటే, వచ్చే ఐదు రాష్ట్రాలతో సహా బీజేపీ ఎన్నికలకు వెళ్ళనుందా? పార్లమెంట్ ఎన్నికలు ముందే రాబోతున్నాయా? అలా వస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? ఇలాంటి ఊహాగానాల్లో మొత్తం దేశం కొట్టుకుపోయింది. ఇంతలో ఇంకో బాంబు పేల్చింది బిజెపి. అదేమిటంటే దేశం పేరు ఇండియా తొలగించి కేవలం భారత్ మాత్రమే ఉండాలని. ఇక ఇప్పుడు ప్రతిపక్షాలతో పాటు దేశమంతా ఒకే దేశం ఒకే పేరు అనే చర్చల, వాదోపవాదాల్లో పడిపోయింది. సహజంగానే ప్రతిపక్షాలు కూడా అందులో కూరుకుపోయాయి. బిజెపి టైమింగ్ అంటే ఇదే.

జి20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 8న ఈ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మరి విదేశాల ప్రముఖులు మన దేశం వస్తున్నప్పుడు దేశంలో మత ఘర్షణలు, జాతుల పోరాటాలు, నిరుద్యోగ సమస్యలు, అధిక ధరల ఆకలికేకల మంటలు.. ఇలాంటివి వినిపిస్తే ప్రపంచం ఏమనుకుంటుంది చెప్పండి? సో.. బిజెపి అత్యంత వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు ఎక్కుపెట్టే బాణాలను తమకు అనుకూలమైన అంబుల పొదిలో దూరి విశ్రాంతి తీసుకునేలా చేసింది. ఇటు దేశమంతా అటు ప్రతిపక్షాలు కలిసికట్టుగా బిజెపి వ్యూహామాయలో పడిపోవడమే కాదు, అటు ప్రపంచంలోని దేశాలు కూడా భారతదేశం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. అదేమంటే, కేవలం ఇండియా పేరు మారితే ఎలా అనేది.

ప్రపంచం ఆలోచన తాజాగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ డిప్యూటీ అధింకార ప్రతినిధి ఫర్హాన్ హక్ ఈ విషయంలో స్పందించిన వార్త వెలుగు చూసింది. గత ఏడాది టర్కీ కూడా తమ దేశం పేరు తుర్కియే అని మార్చుకుందని, ఒకవేళ ఇండియా నుంచి పేరు మార్పు ప్రతిపాదన తమకు వస్తే పరిశీలిస్తామని ఆయన అన్నారట. ఇలా చెప్పాలంటే అనేక ఉదాహరణలు చూపొచ్చు. సెప్టెంబర్ 17 న హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ పెట్టే పెద్ద బహిరంగ సభ గురించి తెలుసు కదా. సరిగ్గా అదే రోజున అదే పెరేడ్ గ్రౌండ్స్ లో బిజెపి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూశారా, దటీజ్ బిజెపి టైమింగ్. దేశాన్ని, ప్రతిపక్షాలని, అటు ప్రపంచ దేశాలని కూడా తమవైపు మళ్లించుకున్న చాకచక్యం. అందుకే బిజెపి టైమింగ్ కి సెల్యూట్ చెప్పాలి.