Site icon HashtagU Telugu

Terrorists Attack : కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి.. ఆర్మీ బేస్‌పై కాల్పులు.. ఒకరు మృతి

Terrorists Attack

Terrorists Attack

Terrorists Attack : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు మరోసారి పేట్రేగారు. దోడా జిల్లాలోని ఛాతర్‌గలా ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన  తాత్కాలిక చెక్‌ పాయింట్‌పై  మంగళవారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇక భద్రతా బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా, ఓ పౌరుడు గాయపడ్డాడు. ఈ దాడికి సంబంధించిన వివరాలను జమ్మూకశ్మీర్ ఏడీజీపీ ఆనంద్ జైన్ మీడియాకు వెల్లడించారు. కతువా జిల్లాలోని సైదా సుఖుల్ గ్రామంపై సోమవారం సాయంత్రం దాడి చేసిన ఉగ్రవాదుల జాడ కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ జరుపుతుండగా ఈ దాడి జరిగిందన్నారు.  ప్రస్తుతం ఎన్‌కౌంటర్ జరుగుతోందని, ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం అదనపు బలగాలు ఛాతర్‌గలా ప్రాంతానికి చేరుకున్నట్టు ఆనంద్ జైన్ చెప్పారు. గత మూడు రోజుల వ్యవధిలో కశ్మీర్‌లో జరిగిన మూడో ఉగ్రదాడి(Terrorists Attack) ఇది. ఇంతకుముందు రియాసి , కథువాలలో ఇదే తరహాలో ఉగ్రదాడులు జరిగాయి.

We’re now on WhatsApp. Click to Join

ఆదివారం సాయంత్రం కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో బస్సు లోయలో పడిపోయింది. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లోయలో పడిపోయిన బస్సుపై అరగంట పాటు కొండపై నుంచి ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనకు పాల్పడిన కొద్ది గంటల్లో సోమవారం రోజు కథువాలోని హీరానగర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపాన ఉన్న సైదా సుఖుల్ గ్రామంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పౌరులు గాయపడ్డారు. సైన్యం ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడు పాకిస్తాన్‌కు చెందినవాడని గుర్తించారు.