మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక, ఉన్నత విద్య కోసం అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతురాలైన విద్యార్థిని భవితకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని భవిత పదో తరగతిలో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. అలాగే పాలిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 634వ ర్యాంక్ సాధించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా స్కూల్ ఫీజు బకాయిలు చెల్లించలేకపోవడంతో ఆమె సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బంది పడుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కోమటిరెడ్డి దృష్టికి వెళ్లింది. విషయాన్ని తెలుసుకున్న మంత్రి ఉదయాన్నే తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి పూర్తి వివరాలు సేకరించారు.
అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్‌తో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి, విద్యార్థిని సర్టిఫికెట్లతో పాటు మినిస్టర్ క్వార్టర్స్‌కు రావాలని ఆదేశించారు. మినిస్టర్ క్వార్టర్స్‌కు వచ్చిన భవితతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడి ఆమె భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. డిప్లొమా పూర్తి చేసి ఇంజినీరింగ్ చదవాలన్న తన లక్ష్యాన్ని భవిత వివరించింది. ఆమె ప్రతిభను గుర్తించిన మంత్రి అక్కడికక్కడే రూ.60 వేల స్కూల్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు విద్యార్థినికి అందజేశారు. అంతేకాకుండా తక్షణ ఖర్చుల కోసం మరో రూ.20 వేల ఆర్థిక సాయం కూడా అందించారు. భవిష్యత్‌లో ఉన్నత విద్య కోసం అవసరమైన సహాయం అందిస్తానని భవితకు హామీ ఇచ్చిన మంత్రి.. ల్యాప్‌టాప్ అవసరమైనా లేదా మరే విద్యా సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని సూచించారు. పాలిసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చివరి తేదీ కావడంతో వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని తన సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ప్రతి మనిషి దేవునితో సమానం. మనకు చేతనైన సాయం అవసరంలో ఉన్నవారికి చేయాలి” అని పిలుపునిచ్చారు. మంత్రి ప్రత్యేక చొరవతో తమ కుమార్తె చదువు కొనసాగించే అవకాశం లభించిందని భవిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన సాయాన్ని జీవితాంతం మర్చిపోలేమని భవిత తల్లిదండ్రులు తెలిపారు.
