Panther Attack : ఓ చిరుత హడలెత్తిస్తోంది. గత 11 రోజుల్లో ఏడుగురిని హతమార్చింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పరిధిలో ఉన్న గోగుండా గ్రామంలో ఈ అలజడి నెలకొంది. విష్ణుగిరి అనే 65 ఏళ్ల పూజారి ఆలయం వద్ద నిద్రిస్తుండగా ఇటీవలే ఆ పులి దారుణంగా చంపేసింది. అంతేకాదు అడవుల్లోకి పూజారి శరీరాన్ని లాక్కెళ్లింది. ఇవాళ ఉదయం ఆలయానికి దాదాపు 150 మీటర్ల దూరంలో పూజారి డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఈఘటనతో పరిసర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏ క్షణం పులి తమ గ్రామంపైకి దాడి చేస్తుందోననే ఆందోళన స్థానికులను ఆవహించింది. పోలీసులు, అటవీశాఖ అధికారులు బోన్లు(Panther Attack) ఏర్పాటు చేసినా.. పులి దాడులు ఆగకపోవడం గమనార్హం. ఈ బోన్లలో పలు చిరుతలు చిక్కినప్పటికీ.. ఇంకా వాటి దాడులు కొనసాగుతున్నాయి. దీన్నిబట్టి ఆ గ్రామం పరిసరాల్లోని అడవుల్లో పెద్దసంఖ్యలో పులులు ఉండొచ్చనే అంచనాకు వస్తున్నారు.
Also Read :Atom Bomb : ఆటం బాంబుతో ఇజ్రాయెల్‌కు జవాబివ్వండి.. ఇరాన్ అతివాదులు
పులుల దాడుల నేపథ్యంలో చీకటి పడ్డాక గోగుండా గ్రామ ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. స్థానిక స్కూళ్లను కూడా త్వరగా మూసేస్తున్నారు. పులులను అన్నింటినీ బోన్లలో బంధించే దాకా కొన్ని రోజుల పాటు సాయంత్రం వేళ ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ గ్రామస్తులకు అధికారులు సూచనలు జారీ చేశారు. ఒకవేళ బయటకు వచ్చినా గుంపులుగా రావాలని కోరుతున్నారు. సాయంత్రం తర్వాత బయట తిరిగి వారి చేతిలో కర్రలు లేదా ఇతర ఆయుధాలు తప్పకుండా ఉండేలా చూడాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈమేరకు సందేశాలను స్థానికులకు సోషల్ మీడియా ద్వారా పోలీసులు పంపుతున్నారు. గత 11 రోజుల వ్యవధిలో గ్రామంపై జరిగిన దాడులన్నీ ఒకే చిరుత పనై ఉండొచ్చని అటవీ అధికారులు అంచనావేస్తున్నారు. దాడి చేసిన తీరు ఆధారంగా ఈ అంశంపై ఒక అంచనాకు వస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామం శివార్లు, గ్రామంలోని ప్రధాన వీధుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా గ్రామంలోని ప్రతీ కదలికను పోలీసులు, అటవీ అధికారులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు.