West Bengal : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఐదేళ్ల చిన్నారి రాసిన ఓ లేఖ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది. “ప్రియమైన మమత దీదూన్ (అమ్మమ్మ)… మా అమ్మను దయచేసి మా ఇంటికి పంపించండి. అమ్మ లేకుండా నాకు చాలా బాధగా ఉంది” అంటూ రాసిన ఈ అమాయకపు అక్షరాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నారి పేరు ఐతిజ్య దాస్. అసన్‌సోల్‌కు చెందిన ఈ బాలుడు తన తల్లి స్వాగత పెయిన్ కోసం సీఎం మమత బెనర్జీకి లేఖ రాశాడు. తల్లి తన దగ్గర ఉండాలని, ఆ తల్లి ఉద్యోగం మన ఊర్లోనే ఉండాలని కోరుకుంటూ ఆ చిన్నారి తన హృదయాలను అక్షరాలుగా మార్చాడు. ఐతిజ్య తల్లి 2021లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. అయితే ఆమెకు అసన్‌సోల్ నుంచి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో పోస్టింగ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె కుటుంబానికి దూరంగా ఉంటూ, అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చి వెళ్తున్నారు.
Read Also: Weather Updates : అలర్ట్.. ఏపీ, తెలంగాణలో ఐదు రోజులపాటు కుండపోత వర్షాలు
ఈ వేరు జీవనాన్ని ఓ ఐదేళ్ల బాలుడికి అర్థం చేసుకోవడం కష్టమే. తన మానసికంగా ఎదుర్కొంటున్న బాధను ఆయన అక్షరాలలో చూపించేందుకు ప్రయత్నించాడు. “మా ఇల్లు అసన్‌సోల్‌లో ఉంది. మా అమ్మ ఉత్తర దినాజ్‌పూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. అందుకే ఆమె మాకు దూరంగా ఉంటోంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుంది. నేను ఇక్కడ మా నాన్న, తాతయ్యతో కలిసి ఉంటున్నాను. అమ్మ లేకుండా ఉండటం నాకు చాలా బాధగా ఉంది. నేను అమ్మను చాలా ప్రేమిస్తున్నాను. దయచేసి మా అమ్మను త్వరగా ఇంటికి పంపండి. ఆమె ఇక మాకు దూరంగా ఉండకుండా చూడండి అంటూ లేఖలో తల్లిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఐతిజ్య తల్లి స్వాగత మాట్లాడుతూ..నేను నా బదిలీ కోసం ఇప్పటికే చాలా కార్యాలయాలకు లేఖలు రాసాను. కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. 2021లో మా తరహాలోనే సుమారు 16,500 మంది ప్రాథమిక ఉపాధ్యాయులు తమ ఇళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్‌లతో బాధపడుతున్నారు అని వివరించారు. ఇది కేవలం ఆమె ఒక్కరికి చెందిన సమస్య కాదు. అది రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఉపాధ్యాయ కుటుంబాల వేదన.
ఐతిజ్య ఆశగా చెబుతున్నాడు మమత దీదూన్ నా విజ్ఞప్తిని తప్పకుండా వింటారని నమ్ముతున్నాను. ఆమె నా కోరిక నెరవేరిస్తే నేను మరో లేఖ రాస్తాను ధన్యవాదాల లేఖ! ఈ చిన్నారి ఆశలు తల్లి ప్రేమ కోసం. అది ప్రభుత్వాన్ని కదిలించగలవా అన్నదే ఇప్పుడు ప్రశ్న. చిన్నారి ఐతిజ్య లేఖ కేవలం తన వ్యక్తిగత బాధనే కాకుండా, ప్రభుత్వ విధానాల్లో మార్పు అవసరమన్న ఒక చిన్న గొంతు. ముఖ్యమంత్రి స్పందిస్తే, ఇది కేవలం దాస్ కుటుంబానికే కాకుండా, ఇలాంటే సమస్యలతో బాధపడుతున్న వేలాది కుటుంబాలకు ఊరట కలిగించగలదని ప్రజలు ఆశిస్తున్నారు.