Isha Foundation : ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తమిళనాడులోని కోయంబత్తూరు కేంద్రంగా ఈశా ఫౌండేషన్‌ను నడుపుతుంటారు. తాజాగా ఇవాళ ఈశా ఫౌండేషన్ కీలక వివరణను విడుదల చేసింది. తమ యోగా కేంద్రానికి వచ్చే వారికి పెళ్లి చేసుకోవాలని కానీ, సన్యాసులుగా మారమని కానీ తాము సూచించమని స్పష్టం చేసింది. పెళ్లి విషయంలో ఎవరి నిర్ణయం వారిదని.. అలాంటి విషయాలను తాము ప్రస్తావించమని ఈశా ఫౌండేషన్ (Isha Foundation) తేల్చి చెప్పింది. తమ కుమార్తెకు పెళ్లి చేసిన జగ్గీ వాసుదేవ్ ఇతరుల కూతుళ్లను సన్యాసినులుగా ఎందుకు మార్చాలని భావిస్తున్నారు ? అని మద్రాసు హైకోర్టు ఇటీవలే ప్రశ్నించింది. దీనికి స్పందనగానే ఈశా ఫౌండేషన్ పైవివరణను జారీ చేసింది.
Also Read :Moringa Ladoo : మునగ లడ్డూ తింటే ఆ రెండు సమస్యలు పరార్
పెళ్లిళ్ల విషయాలు తమ యోగా కేంద్రం బోధనలో ఉండవని.. ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంచడం మాత్రమే లక్ష్యమని ఈశా ఫౌండేషన్ తెలిపింది. పెళ్లిళ్ల గురించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, జ్ఞానం ప్రజలకు ఉందని పేర్కొంది. ఈశా యోగా సెంటర్‌కు వచ్చే వేలాది మందిలో ఎవరూ సన్యాసులు కారని స్పష్టం చేశారు. అతికొద్ది మందే సన్యాసం తీసుకున్నారని ఈశా ఫౌండేషన్ పేర్కొంది. ‘‘ఈశా యోగా సెంటర్‌కు వచ్చే వారిలో సన్యాసులుగా మారిన వారిని విచారణ నిమిత్తం కోర్టు పిలిచింది. వారు కోర్టు ఎదుట హాజరై వ్యక్తిగత నిర్ణయం ప్రకారమే సన్యాసులుగా మారినట్లు చెప్పారు’’ అని ఫౌండేషన్ గుర్తు చేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై మరింత చర్చ సరికాదని తెలిపింది. దీనికి న్యాయపరమైన పరిష్కారం త్వరలోనే లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read :WhatsApp Video Calls : వాట్సాప్ వీడియో కాల్స్‌లో సరికొత్త ఫీచర్లు ఇవే
కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలు గీత, లతలను అప్పగించాలంటూ కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. తమ కుమార్తెలు యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండి పోయారని ఆయన వాపోయారు. అయితే తమను ఇబ్బందికి గురిచేయకూడదంటూ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ కుమార్తెలు గీత, లత సివిల్ కేసు వేశారు. కుమార్తెలు తీసుకున్న ఈ నిర్ణయంతో కామరాజ్ , ఆయన భార్య మానసికంగా ప్రభావితమయ్యారు. ఇవే వివరాలను కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టుకు కామరాజ్ తెలిపారు. తమ కుమార్తెలను ఈశా యోగా కేంద్రంలోని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. తమ కుమార్తెలు అక్కడి నుంచి బయటికొస్తే ఇబ్బందిపెట్టమని, ప్రత్యేక స్థలం ఇచ్చి ఏకాంతాన్ని కాపాడతానన్నారు. సోమవారం రోజు ఈ కేసుపై విచారణ సందర్భంగా గీత, లతలు హైకోర్టు బెంచ్ ఎదుట హాజరయ్యారు. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు పెళ్లి చేసిన ఫొటోను చూసిన న్యాయమూర్తులు.. ఇతరుల పిల్లలను సన్యాసినులుగా మార్చాలని జగ్గీ ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. దానికి స్పందనగానే ఇప్పుడు ఈశా ఫౌండేషన్ వివరణ జారీ చేసింది.