ATMs In Trains: త్వరలోనే రైళ్లలోనూ మనకు ఏటీఎంలు కనిపించబోతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే రైల్వే శాఖ కీలక ముందడుగు వేసింది. భారత రైల్వేశాఖ ఆదేశాల మేరకు సెంట్రల్ రైల్వే ఇటీవలే ట్రయల్స్ చేసి చూసింది. తొలిసారిగా ముంబై -మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలులో ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నడుస్తున్న రైలులోనూ మనం డబ్బులను డ్రా చేసుకోవచ్చని నెటిజన్లు తెగ సంబర పడిపోతున్నారు.
Also Read :ED Raids : సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌లో ఈడీ రైడ్స్.. కారణాలివీ
పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలులో ట్రయల్
ముంబై -మన్మాడ్ మార్గంలో పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలు(ATMs In Trains) ప్రతి రోజు రాకపోకలు సాగిస్తుంటుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు వెళ్లే ఈ రైలులో ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎంను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేశారు. ఈవిషయాన్ని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫిసర్ స్వప్నిల్ నీలా మీడియాకు తెలిపారు. రైలులోని ఒక బోగీలో గతంలో తాత్కాలిక ప్యాంట్రీ కోసం ఉపయోగించిన స్థలంలో.. ప్రయోగాత్మకంగా ఒక ఏటీఎం మెషీన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైలు కదులుతున్నప్పుడు భద్రతాపరంగా ఏటీఎంకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా షట్టర్ డోర్‌ను అమర్చారు. ఏటీఎం భద్రతకు అనుగుణంగా సదరు రైలు బోగీలో అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్‌షాప్‌లో చేశారు. త్వరలోనే మరిన్ని రైళ్లలోనూ ఏటీఎంలను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.