Rahul Gandhi US Tour : అమెరికాకు చేరుకున్న రాహుల్‌గాంధీ.. పర్యటన షెడ్యూల్ ఇదీ
Pasha
Rahul Gandhi US Tour : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం తెల్లవారుజామున అమెరికాకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.
భారత్ – అమెరికా సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటనకు వచ్చానని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈమేరకు ఆయన ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు. ఈ పర్యటనలో భాగంగా కొన్ని అర్ధవంతమైన చర్చలలో పాల్గొంటానని రాహుల్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం సహా పలుచోట్ల జరిగే సదస్సుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi US Tour) ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
‘‘రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8న డల్లాస్‌లో ఉంటారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఉంటారు. డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులు, విద్యావేత్తలు, కమ్యూనిటీ వ్యక్తులతో రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. కొందరు టెక్నోక్రాట్‌లతోనూ రాహుల్ భేటీ అవుతారు. డల్లాస్ ప్రాంతానికి చెందిన కొందరు నాయకులతో జరిగే విందు కార్యక్రమానికి రాహుల్ హాజరవుతారు’’ అని శామ్ పిట్రోడా ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. కాగా, త్వరలో జరగనున్న హర్యానా, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. హర్యానాలో ఆప్‌తో జట్టు కట్టాలని హస్తం పార్టీ యోచిస్తోంది. అయితే దీనిపై ఆప్ వైపు నుంచి ఇంకా ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు.