Site icon HashtagU Telugu

Quad Countries : ఉగ్రవాదంపై భారత్‌కు అండగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా

Quad Countries

Quad Countries

Quad Countries : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాల కూటమి అయిన క్వాడ్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని తరిమికొట్టే పోరాటంలో భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ దేశాలు స్పష్టం చేశాయి. వాషింగ్టన్‌లో మంగళవారం జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

పహల్గామ్ దాడిని హేయమైన చర్యగా పేర్కొన్న క్వాడ్, దానికి పాల్పడిన వారిని, మద్దతివ్వడంలో పాల్గొన్న వారిని చట్టానికి లోబర్చాలని పేర్కొంది. సరిహద్దు ఉగ్రవాదం సహా అన్ని రకాల ఉగ్రచర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ దాడిపై జరుగుతున్న దర్యాప్తుకు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ సహకరించాలని కోరింది. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి బెయిల్.. విడుదలయ్యే అవకాశం.. కానీ

ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, “ఉగ్రవాదంపై ప్రపంచం శూన్య సహన విధానాన్ని తీసుకోవాలి. బాధితులకు , నేరస్తులకు సమానంగా చూడరాదు. తమ ప్రజలను రక్షించుకోవడమంటే భారత్‌కు పూర్తి హక్కు ఉంది. ఆ హక్కును వినియోగించుకోవడంలో సందేహం లేదు” అని అన్నారు. పహల్గామ్ దాడికి ప్రతిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావిస్తూ, క్వాడ్ దేశాలు భారత్ స్థైర్యాన్ని అర్థం చేసుకుంటాయని తెలిపారు.

జూన్ 30 నుండి జులై 2 వరకు అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జపాన్ మంత్రి తకేషి ఇవాయా, ఆస్ట్రేలియా మంత్రి పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక స్థిరత్వం, ఉగ్రవాద నిరోధంపై చర్చలు జరిగాయి. అనంతరం జైశంకర్, రూబియోతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

MS DHONI : ఎంఎస్ ధోని సంచలనం..‘కెప్టెన్ కూల్’ పేరిట ట్రేడ్ మార్క్ కైవసం!