Religious Structures : ఆక్రమిత ప్రదేశాలలోని మతపరమైన కట్టడాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్లు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన అన్ని మతాల కట్టడాలను తొలగించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దేశ ప్రజల ప్రాణాల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారి నివాసాలను, వ్యాపార స్థలాలను బుల్డోజర్‌తో కూల్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు విచారించింది. ‘‘ఇండియా సెక్యూలర్ దేశం. ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్ చర్యలు మతాలతో(Religious Structures) సంబంధం లేకుండా అందరికీ ఒకేలా ఉండాలి’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.
Also Read :Dussehra Holidays 2024 : ఏపీలో అక్టోబరు 3 నుంచి దసరా సెలవులు
ఈసందర్భంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ఏదైనా క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లపైకి మాత్రమే బుల్డోజర్‌లు పంపుతున్నారా ? ఈ చర్యలు తీసుకోవడానికి నిందితుడు చేసిన నేరాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నారా ?’’ అని ఈసందర్భంగా తుషార్ మెహతాను సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. అయితే సాధారణ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడం లేదని తుషార్ మెహతా స్పష్టం చేశారు. అత్యాచారం, రేప్, ఉగ్రవాదం వంటి కేసులలో నిందితులుగా ఉన్నవారిపై మాత్రమే బుల్డోజర్ చర్యలను యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్నాయని తెలిపారు. బుల్డోజర్ చర్యలు తీసుకోబోతున్న అంశంపై కొన్ని రోజులు ముందుగానే స్థానిక సంస్థ ద్వారా సదరు నిందితుడికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా నోటీసులు పంపుతున్నామని.. అయితే ఈ ప్రక్రియలో ఇంకొంత వేగం అవసరమని తుషార్ మెహతా పేర్కొన్నారు. ఇంకొన్ని రోజులు ముందుగానే నోటీసులు నిందితుడి కుటుంబానికి అందితే బాగుంటుందనే సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయంతో సొలిసిటర్ జనరల్ ఏకీభవించారు.
Also Read :Nandyala : నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు.. ఏమైందంటే..
ఈసందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ స్పందిస్తూ.. ‘‘మనదేశంలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, గ్రామపంచాయతీలకు ఒక్కో రకమైన చట్టాలు ఉన్నాయి. ఇలాంటి బుల్డోజర్ చర్యలు తీసుకునే సమాచారాన్ని అధికారికంగా ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ప్రతీ రాష్ట్రానికి ఒక అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ఉండాలి.తద్వారా ఆయా చర్యల రికార్డులన్నీ డిజిటలైజ్ కూడా అవుతాయి’’ అని అభిప్రాయపడింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సీయూ సింగ్ వాదనలు వినిపించారు. నేరాలపై పోరాటం చేసేందుకు బుల్డోజర్ చర్యలను వాడుకోవడం అనేది సరికాదన్నారు.