Priyanka Gandhi : కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా ప్రియాంక వెంట సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారిగా ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) అరంగేట్రం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ గెలిచారు. అయితే ఆయన రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎంపీగా కంటిన్యూ అయ్యేందుకు మొగ్గుచూపారు. ఫలితంగా వయనాడ్ లోక్‌సభ స్థానం ఖాళీ అయింది.
Also Read :McDonalds Burger : మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లతో ‘ఈ-కొలి’.. ఏమిటీ ఇన్ఫెక్షన్ ?
దీంతో వయనాడ్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి తన తల్లి సోనియా గాంధీతో కలిసి మంగళవారం సాయంత్రమే ఆమె కర్ణాటకలోని మైసూర్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వయనాడ్‌కు చేరుకున్నారు.
Also Read : Pulivendula : ఘోర ప్రమాదం.. 30 అడుగుల లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు
‘‘వయనాడ్ ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. వారికి నా సోదరి ప్రియాంకా గాంధీ కంటే మెరుగైన ప్రతినిధిని నేను ఊహించలేను. నా సోదరి వయనాడ్‌లో తప్పకుండా గెలుస్తుంది. వయనాడ్ ప్రజల కష్టాలను ప్రియాంక తీరుస్తారు. పార్లమెంటులో శక్తివంతమైన గొంతుకగా ఆమె ఎదుగుతారు’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా, ప్రియాంకా గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలిస్తే గాంధీ కుటుంబం నుంచి పార్లమెంటులోకి అడుగుపెట్టిన మూడో వ్యక్తిగా రికార్డును క్రియేట్ చేస్తారు. వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్, లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) అభ్యర్థిగా సత్యన్ మొకేరి బరిలోకి దిగారు. అయితే వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం ప్రియాంకకు కలిసొచ్చే అవకాశం ఉంది.