Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత ప్రభుత్వం దేశ సైనిక గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి 7.85 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో సైన్యం ఆధునీకరణ కోసం 2.19 లక్షల కోట్లు, విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం 63,733 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.
దీనిలో భాగంగానే గగనతల నిఘా, యుద్ధ సన్నద్ధతను బలోపేతం చేసే ప్రయత్నాలను సైన్యం వేగవంతం చేసింది. 30లో-లెవల్ లైట్ వెయిట్ రాడార్ల కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయడం దీనికి నిదర్శనం.
725 కోట్ల రూపాయల భారీ డీల్
ఈ కొనుగోలు ఒప్పందం విలువ సుమారు 725 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అత్యవసర కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ఈ రాడార్లను ‘ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్‌మెంట్’ పద్ధతిలో కొనుగోలు చేయనున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో వెల్లడైన లోపాలను సరిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: పాన్ తినడం వల్ల షుగర్ లెవల్ పెరుగుతుందా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో శత్రువుల కదలికలను, డ్రోన్ దాడులను గుర్తించడంలో భారత సైనిక రాడార్ వ్యవస్థలు కీలక పాత్ర పోషించి శత్రువుల కుతంత్రాలను అడ్డుకున్నాయి. రక్షణ రంగంలో కొనుగోలు ప్రక్రియలో RFP అనేది మొదటి, కీలకమైన అడుగు. దీని ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ టెక్నికల్ స్పెసిఫికేషన్లు, వాణిజ్య నిబంధనలను వివరిస్తూ సంభావ్య విక్రేతల నుండి బిడ్లను ఆహ్వానిస్తుంది.
కొత్త రాడార్ల ఉపయోగం ఏమిటి?
ఈ కొత్త రాడార్లను పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు, మైదానాలు, పాక్షిక ఎడారి, ఎడారి, తీర ప్రాంతాలతో సహా వివిధ రకాల భౌగోళిక పరిస్థితుల్లో వినియోగిస్తారు. ఇవి వివిధ యుద్ధ రంగాల్లో నిఘా పెట్టడానికి, వైమానిక దాడులపై తక్షణమే స్పందించేందుకు సైన్యం సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి సహాయంతో శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించడం మరింత సులభతరం అవుతుంది.
