PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించారు. ఆ రాష్ట్రంలోని భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిను నరేంద్ర మోదీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. కొత్త రైలుబ్రిడ్జిని, కొత్త లిఫ్ట్‌ను, రామేశ్వరం – తాంబరం రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ రైల్వే సముద్ర బ్రిడ్జి ఇది. రామసేతువుతో చారిత్రక సంబంధం ఉన్న ఈ ప్రాంతానికి ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త వంతెన ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఈ కార్యక్రమంకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి తమిళ సీఎం స్టాలిన్ హాజరుకాకపోవటం గమనార్హం.
Also Read: Fact Check : చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డ ఫొటో ఎప్పటిది ?
అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమిళనాడుకు కేంద్రం నిధులు పెంచినప్పటికీ కొందరు నిరాశే వ్యక్తం చేస్తున్నారని మోదీ అన్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని, 2014 వరకు రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 900 కోట్లు కేటాయిస్తే.. ఎన్డీయే ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.600 కోట్లు కేటాయించిందని అన్నారు. తమిళనాడు నేతలు తనకు లేఖలు రాస్తున్నారనీ, కానీ ఏ ఒక్కరూ తమిళంలో సంతకాలు చేయడం లేదని అన్నారు. తమిళం మీకు గర్వకారణమైతే కనీసం సంతకాలైనా తమిళంలో చేయాలని కోరుతున్నాను అని మోదీ వ్యాఖ్యానించారు. తమిళ భాష, వారసత్వం ప్రపంచం నలుమూలలా విస్తరించేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని మోదీ చెప్పారు.
Also Read: Pithapuram : టీడీపీ కార్యకర్తలపై జనసేన కేసులు.. పంచాయితీ ముదురుతుందా?
తమిళ భాషలో మెడికల్ కోర్సులు ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని నేను కోరుతున్నానని.. ఇందువల్ల పేద కుటుంబాల పిల్లలు సైతం వైద్యులు కావాలనే తమ కలలను నెరవేర్చుకునే అవకాశం దక్కుతుందని మోదీ అన్నారు. మన యువత వైద్యులు కావడానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. గత పదేళ్ల కాలంలో తమిళనాడు రాష్ట్రంకు కొత్తగా పది మెడికల్ కాలేజీలు వచ్చాయని మోదీ చెప్పారు.
ప్రధాని కార్యక్రమంకు హాజరుకాకపోవటంపై సీఎం స్టాలిన్ స్పందించారు. రామేశ్వరంలో జరిగే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశానని అన్నారు. రాష్ట్రంలోని నీలగిరిలో ఇంతకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు తాను హాజరు కావాల్సి ఉందని, అందుకే తాను బ్రిడ్జి ప్రారంభోత్సవం కార్యక్రమానికి రాలేనని తెలియజేశానని స్టాలిన్ చెప్పారు.