All Party Delegations: జాతీయ రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి వివరించేందుకు విదేశాలకు వెళ్లే అఖిలపక్ష బృందాలకు ఎంపీలను ఎంపిక చేసే వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. తాము చెప్పిన నేతలకు అఖిలపక్ష బృందాలలో చోటు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఎంపీల ఎంపిక గురించి అస్సలు తమను సంప్రదించనే లేదని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. ‘‘పార్టీల సిఫార్సులు మాకు అక్కర్లేదు. వాళ్ల అంతర్గత రాజకీయాల గురించి మాకు అక్కర్లేదు. సమర్ధులైన ఎంపీలను ప్రభుత్వమే అఖిలపక్ష బృందాలకు ఎంపిక చేసింది’’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(All Party Delegations) అంటున్నారు. తీరొక్క వాదనలతో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయో ఈ కథనంలో చూద్దాం..
Also Read :Hyderabad Blasts Plan : గ్రూప్ 2 కోచింగ్ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు
ఆ నలుగురిలో ఒక్కరికే ఛాన్స్
ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుసేన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌లను అఖిలపక్ష బృందాలను ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే వీరిలో నుంచి ఒక్క ఆనంద్ శర్మనే కేంద్ర సర్కారు ఎంపిక చేసింది. మరో నలుగురు కాంగ్రెస్ ఎంపీలను తనంతట తానుగా ఎంపిక చేసి అఖిలపక్ష బృందంలో చోటు కల్పించింది. ఈవిధంగా కాంగ్రెస్ పెద్దల సిఫార్సు లేకుండానే అవకాశాన్ని పొందిన నేతలే.. శశిథరూర్, మనీశ్ తివారీ, అమర్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్. ఈ నలుగురిలో శశిథరూర్‌కు ఏకంగా ఒక అఖిలపక్ష బృందానికి సారథ్యం వహించే అవకాశాన్ని కల్పించారు.
Also Read :Colonel Sofiya Qureshi : కర్నల్ సోఫియా పై వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణలను అంగీకరించలేం : సుప్రీం కోర్టు
తెరపైకి శశిథరూర్, మనీశ్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్
‘‘విదేశాంగ వ్యవహారాలపై మంచి పట్టు కలిగిన కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మనీశ్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్. వారి పేర్లను కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిఫార్సు చేయలేదు. అయినా మేం ఆ ముగ్గురికి గొప్ప అవకాశం కల్పించాం’’ అని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు. ఈ వ్యాఖ్యల ప్రభావంతో శశిథరూర్, మనీశ్ తివారీలు కాంగ్రెస్ హైకమాండ్‌కు మరింత దూరమయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు దూరంగా శశిథరూర్, మనీశ్ తివారీ ఉంటున్నారు. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి శశిథరూర్ బీజేపీలోకి జంప్ అవుతారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఆయనపై కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందని కొందరు జోస్యం చెబుతున్నారు.
మనీశ్ తివారీ.. బీజేపీలోకి వెళ్దామని అనుకున్నారా ?
2024 ఫిబ్రవరిలోనే బీజేపీలోకి వెళ్లిపోవాలని మనీశ్ తివారీ భావించారట. పంజాబ్‌లోని లూధియానా లోక్‌సభ సీటును ఆయనకు ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు కూడా అప్పట్లో ఓకే చెప్పారట. అయితే చివరి నిమిషంలో తన ఆలోచనను మనీశ్ తివారీ మార్చుకున్నారట.
సల్మాన్ ఖుర్షీద్‌కు ప్రయారిటీ తగ్గిందా ?
సల్మాన్ ఖుర్షీద్‌కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ తగ్గించింది. ఆయన సూచించిన వారికి గత లోక్‌సభ ఎన్నికల టైంలో ప్రయారిటీ ఇవ్వలేదు. యూపీ రాజకీయాలపై ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా ఫోకస్ పెట్టడం మొదలైనప్పటి నుంచి అక్కడ సల్మాన్ ఖుర్షీద్‌కు ప్రాధాన్యత తగ్గింది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తేనే అఖిలపక్ష బృందాలతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తానని సల్మాన్ ప్రకటించారు.
యూసుఫ్ పఠాన్ వద్దు.. మేం చెప్పిన వాళ్లే వెళ్లాలి : టీఎంసీ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ యూసుఫ్ పఠాన్‌ను అఖిలపక్ష బృందానికి కేంద్రం ఎంపిక చేసింది. ఈవిషయాన్ని టీఎంసీ పెద్దలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వ్యతిరేకించారు. తాము చెప్పినవాళ్లు మాత్రమే అఖిలపక్ష బృందంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తారని తేల్చి చెప్పారు. బెంగాల్‌లో ముస్లిం మైనారిటీల ఓట్లు ఎక్కువ. ఆ వర్గానికి చెందిన యూసుఫ్ పఠాన్‌ను అఖిలపక్ష బృందం నుంచి వెనక్కి లాగినందు వల్ల రాబోయే రోజుల్లో టీఎంసీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.