Terrorists Sketch: పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రదాడికి బాధ్యత వహించింది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఈ స్కెచ్‌లు కీలకం కానున్నాయి. ఉగ్రదాడిలో పాల్గొని కాల్పులు జరిపినట్లు అనుమానించబడుతున్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఉన్న స్థానికులు ఎవరైనా ఇందులో కనిపిస్తున్న వారి ఆచూకీ తెలపాలని పోలీసులు కోరారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు, ఆ భయంకర దాడి వెనుక ఉన్న క్రూరమైన ప్రణాళికను వెలికితీసేందుకు భద్రతా సంస్థలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి.
Read Also: NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
బాధితులు తెలిపిన వివరాలు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని భద్రతాదళాలు ఈ ఊహా చిత్రాను రూపొందించారు. వీరిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఈ ఉగ్రవాదులు కశ్మీర్‌ను విడిచి వెళ్లే అవకాశం లేదని, సమీప ప్రాంతంలోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కనీసం 5–6 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. పహల్గాంలోని బైసరన్‌లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ కొత్తగా ఏర్పాటైందే. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే. తొలుత ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తరువాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది.
కాగా, మంగళవారం కాశ్మీర్‌లోని పహల్గాంలోని ప్రధాన పర్యాటక ప్రదేశంపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపారు. మృతులలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీయులు ఉండగా, ఇద్దరు స్థానికులు ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మృతులకు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 26 మంది బాధితుల మృతదేహాలను బుధవారం (ఏప్రిల్ 23న) తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి తరలించారు. ఆ తరువాత పోలీస్ కంట్రోల్ రూమ్‌కు షిఫ్ట్ చేశారు.
Read Also: JD Vance : తాజ్ మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం