Pahalgam Attack : పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వాటితో పాటు గతంలో పాక్ ఉగ్రవాదులు భారత్‌లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పహల్గాం ఘటనతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Also: Chardham Yatra : నేటి నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
ఈక్రమంలోనే ప్రధాని మోడీ నివాసంలో నిన్న కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు గంట పాటు జరిగిన భేటీలో దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులను శిక్షించాలన్నది దేశ ప్రజల దృఢ నిశ్చయమని ప్రధాని మోడీ ఈసందర్భంగా స్పష్టంచేశారు. మన సైనిక దళాల సామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రిదళాధిపతి (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్ అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇక ఉగ్రదాడి ఘటనతో పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది.